వెలవెలబోతున్న ప్రాణహిత పుష్కరాలు

ఉమ్మడి రాష్ట్రంలో గత పర్యాయం రంగరంగ వైభవంగా జరిగిన ప్రాణహిత పుష్కరాలు ఇప్పుడు  స్వరాష్ట్రంలో వెలవెలబోతున్నాయి. తెలంగాణాలో పుట్టి, తెలంగాణలోనే సముద్రంలో కలిసే, గోదావరి నది నిత్యం పారుతూ ఉండేందుకు కీలకమైన ఈ నది పుష్కరాలు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి సాక్షిగా నిలుస్తున్నాయి.
12 రోజుల పాటు భక్తజన సందోహంతో విరాజిల్లాల్సిన కాళేశ్వరం క్షేత్రం, త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు లేక అధికారుల తీరుతో నిర్మానుష్యంగా మారింది. పుష్కారాలు ప్రారంభమై నాలుగు  రోజులు గడుస్తున్నప్పటికీ కాళేశ్వరానికి వచ్చే భక్తులను అధికారులే పొరుగున మహారాష్ట్రకు తరలిస్తుండటంతో భక్తులు లేక కాళేశ్వరం పురవీధులు వెలవెలబోతున్నాయి.
గతంలో నాటి ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా వచ్చి తొలి పుష్కరస్నానం చేశారు. భక్తుల పుణ్యస్నానాల కోసం ఘాట్ ల నిర్మాణం, ఇతర ఏర్పాట్లకు రూ 10 కోట్లు కేటాయించారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం కూడా రూ 10 కోట్లు కేటాయించి, భక్తులకు మంచి ఏర్పాట్లు చేసింది.
అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం పుష్కర ఏర్పాట్ల గురించి సమీక్ష కూడా జరపలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా కేటాయించలేదు.  దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి మాత్రం స్థానిక ఎమ్యెల్యేతో కలసి వచ్చి తొలిరోజు పుష్కర స్నానం చేసి వెళ్లారు. గత డిసెంబర్ లో మంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలో రూ 30 కోట్ల నిధులు అవసరమని జిల్లా కలెక్టర్లు చెప్పారు. కానీ ప్రభుత్వం నుండి స్పందన లేదు.
గత ప్రభుత్వం కట్టిన పుష్కర ఘాట్ లు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటికి అవసరమైన మరమ్మట్లు చేసి, భక్తులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదు.  పుష్కరాలపై ప్రభుత్వం ఏ మాత్రం ప్రచారం నిర్వహించ లేదు.
పైగా,   కాళేశ్వరానికి వచ్చిన భక్తులను అధికారులు 10 మినీ బస్సుల ద్వారా ఉచితంగా మహారాష్ట్రలోని సిరొంచకు తరలిస్తున్నారు. అక్కడి వెళ్ళి పుష్కర స్నానం చేసి తిరిగి నేరుగా తమ, తమ  స్వస్థలాలకు వెళుతున్నారు. వివిధ ప్రాంతాల నుండి ప్రాణహిత పుష్కరాలకు మహారాష్ట్ర సిరొంచకు నిత్యం 1లక్ష 50వేలకు పైగా భక్తులు వెళ్తున్నట్లు సమాచారం.
వివిధ ప్రాంతాలు, రాష్ట్ర నలుమూలలనుండి భక్తులు వస్తారనే అంచనాలతో కాళేశ్వరంలో ఆరు చోట్లు పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు. కానీ వచ్చే వాహనాలను నేరుగా మహారాష్ట్రకు తరలించడంతో వాహనాలు లేక పార్కింగ్‌ స్థలాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రాణహిత పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారని భావించిన చిరు వ్యాపారులు భక్తులు లేక గిరాకీలు కాక సతమతమవుతున్నారు.
అధికారులు కాళేశ్వ రానికి వచ్చే భక్తులను నేరుగా మహారాష్ట్రకు తరలిస్తుండ టంతోనే ఇక్కడ ఈ పరిస్థితి ఏర్పడిందని గతంలో ఇలాంటి పరిస్థితి లేదంటున్నారు. దీంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నామని, అధికారుల తీరుమారకుంటే చిరు వ్యాపారులంతా ధర్నా చేపడతామని చెబుతున్నారు.