
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఢిల్లీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో గురువారం ఉదయం నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఒక విద్యార్థి, ఉపాధ్యాయురాలికి పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం మిగతా విద్యార్థులను స్కూల్ నుండి ఇంటికి పంపించారు.
దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉన్నప్పటికీ దేశ రాజధాని ఢిల్లీలో 24 గంటల వ్యవధిలో 50 శాతం మేర అధికంగా కేసులు రావడం గమనార్హం. ముందురోజు అక్కడ 202 మందికి కరోనా సోకగా, ప్రస్తుతం ఆ సంఖ్య 299 కి చేరింది. కొవిడ్ పాజిటివిటీ రేటు 0.5 శాతం నుంచి 2.70 శాతానికి పెరిగింది.
ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అతిషి మాట్లాడుతూ.. విద్యార్థి, టీచర్‌కు పాజిటివ్ అని తేలడంతో మిగతా విద్యార్థులను ఇంటికి పంపినట్టు తెలిపారు.
రెండేళ్ల తర్వాత ఆఫ్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయని చెప్పారు. కానీ, పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మళ్లీ ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. నొయిడా, ఘజియాబాద్‌లోని పాఠశాలల్లోనూ కరోనా కేసులు వెలుగు చూశాయి. నొయిడాలోని నాలుగు పాఠశాల్లో 23 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది.
ఘజియాబాద్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో గత వారం ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలను మూడు రోజుల పాటు మూసివేశారు.
మరోపక్క దేశ వ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్యలో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. గురువారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం బుధవారం 4.34 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు చేయగా, 1,007 మందికి వైరస్ సోకినట్టు తేలింది.
ముందు రోజుకంటే ఏడు శాతం అధికంగా కేసులు వచ్చాయి. బుధవారం దేశ వ్యాప్తంగా ఒకే ఒక్క మరణం నమోదైంది. ఆ ఒక్కటి కూడా మహారాష్ట్రలో రికార్డయింది. 818 మంది కోలుకోగా, రికవరీ రేటు 98.76 శాతంగా కొనసాగుతోంది. క్రియాశీల కేసుల సంఖ్య 11,058 ( ౦.౦౩) గా ఉంది. బుధవారం 14.48 లక్షల మంది టీకా తీసుకోగా, ఇప్పటివరకు 186 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.
More Stories
శబరిమల సన్నిధానం చుట్టూ ఉన్న ఫ్లైఓవర్ తొలగింపు
రెండు రోజుల్లో భూమిపైనే అత్యంత తెలివైన ఎఐ గ్రోక్ 3
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాటలో 18 మంది మృతి