
కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల ప్రత్యేక సీట్ల కోటా రద్దయింది. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అన్ని విద్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ప్రతి ఏటా ఒక్కో ఎంపికి పది సీట్లు చొప్పున కేటాయించగా, తాజా ఉత్తర్వులతో ఆ కోటా పూర్తిగా రద్దయింది.
అయితే విద్యాలయాల్లో సీట్ల సంఖ్య పెంచాల్సిందిగా పలువురు ఎంపీలు గతకొంతకాలంగా డిమాండ్ చేస్తున్న తరుణంలో సీట్ల కోటాను మొత్తం రద్దు చేయడం గమనార్హం. పార్లమెంట్ సభ్యులతోపాటు, ఇతర కోటాల కింద భర్తీ చేసే సీట్ల భర్తీ ప్రక్రియను కూడా కేంద్రీయ విద్యాలయ సంఘటన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
అయితే, లోక్‌సభలో కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాపై చర్చ జరిగినప్పుడు, ఆ చర్చల్లో కొందరు సీట్ల కోటాను పెంచాలని కోరగా, మరికొందరు ఎత్తివేయాలి సూచించారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రం ఆ సమయంలో ప్రకటించింది.
ఈ విషయమై స్పీకర్ ఓంబిర్లా సైతం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆదేశించారు. పది సీట్ల కోటా సరిపోదని, దాన్ని పెంచాలని, లేదంటే రద్దు చేయాలని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి డిమాండ్ చేశారు. అయితే, ఎంపీల కోటాను రద్దు చేసే యోచనలో ఉందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఆ సమయంలో మంత్రి నిర్ణయాన్ని పలువురు ఎంపీలు వ్యతిరేకించారు.
లోక్‌సభ ఎంపీలు 543 మంది, రాజ్యసభ ఎంపీలు 245 మంది కలిసి ఏటా మొత్తం 7,880 మంది విద్యార్ధులకు కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు ఇప్పిస్తున్నారు. ఎంపీల కోటాలో పారదర్శకత లోపిస్తోందనే విమర్శలు వినపడుతున్నాయి. దీంతో మొత్తం కోటానే రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
More Stories
అమెరికా చట్టాలకు భారతీయ విద్యార్థులు లోబడి ఉండాలి
భారత ప్రభుత్వాన్ని కోర్టులో ఎక్స్ సవాల్
ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లలో 24 మంది మావోలు హతం