శ్రీలంక అధ్యక్షుడు దిగిపోవాలని వీద్దులో నిరసనలు

శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్‌ చేస్తూ జనం వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కొలంబోలో ఆదివారం వేలాదిమంది ఓ పార్కులో గుమికూడారు. రాజపక్సకు వ్యతిరేకంగా ‘గో హోం గొటా’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పలు ప్రాంతాల్లో పార్లమెంట్‌ సభ్యుల ఇళ్లను కూడా ఆందోళనకారులు ముట్టడించారు.
 
దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. ఆహారం, గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఔషధాలు లేకుండా ఎలా బతకాలని జనం మండిపడుతున్నారు. రాజపక్స రాజీనామా చేసే దాకా ఉద్యమం విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు.. అధ్యక్షుడి సెక్రటేరియట్‌ వద్ద శనివారం ప్రారంభమైన నిరసనలు ఆదివారం కూడా కొనసాగాయి.
నిరసనకారులు రాత్రంతా అక్కడే ఉండి ‘గో హోమ్‌ గొట’ అంటూ అధ్యక్షుడి రాజీనామా కోసం నినాదాలు చేశారు. ‘మాకు కరెంట్‌, గ్యాస్‌, పెట్రోల్‌, మెడిసిన్‌ లేవు… అందుకే ఆందోళన చేస్తున్నాం. వారివద్ద పరిష్కార మార్గం లేదు, రాజీనామా చేయాల్సిందే’ అంటూ రాజపక్సను ఉద్దేశించి నిరసనకారులు వ్యాఖ్యానించారు.
అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే ప్రతిపక్షాలకు మద్దతిస్తామని తమిళ్‌ నేషనల్‌ అలయెన్స్‌ (టీఎన్‌ఏ) పార్టీ ఆదివారం ప్రకటించింది. గొటబయపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని సమాగీ జన బలవెగయా(ఎస్‌జేబీ) పార్టీ శుక్రవారం వెల్లడించింది.
 
శ్రీలంక అధ్యక్షుడు గొటబయి రాజపక్సా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ.. గాల్‌ ఫేస్‌ గ్రీన్‌ అర్బన్‌ పార్క్‌లో సుమారు 10వేల మంది నిరసన చేపట్టారు. ”గో హౌం గొటా” అంటూ శనివారం రాత్రి నుండి వారంతా నినాదాలు చేస్తూనే ఉన్నారు. 1948 బ్రిటన్‌ నుండి స్వాతంత్య్రం పొందిన అనంతరం శ్రీలంక అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
 
ప్రభుత్వం స్పందించడం లేదని .. అధ్యక్షుడు రాజీనామా చేసేంతవరకు ఈ నిరసన కొనసాగుతుందని ఒక ఆందోళనకారుడు పేర్కొన్నారు. వారు రాజీనామా చేయడం తప్ప మరో పరిష్కారం లేదని స్పష్టం చేశారు. వారాల తరబడి ఈ సంక్షోభం మొదలైన తర్వాత జరిగిన అతిపెద్ద నిరసన ప్రదర్శనగా మీడియా పేర్కొంది.
 
 దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యాపార వర్గం కూడా అధ్యక్షుడికి మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో ఆయనపై ఒత్తిడి మరింత పెరిగింది. వారంలోగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడాలని వారు కోరుతున్నారు. 
 
ఔషధాలు సహా ఇతర నిత్యావసరాల సరఫరాను పునరుద్ధరించేందుకు శ్రీలంకకు సుమారు 3 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం అవసరమని ఆర్థికమంత్రి అలీసబ్రీ పేర్కొన్నారు. ఈ నెలలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌)తో చర్చలు చరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.
శ్రీలంకలో సంక్షోభాన్ని తట్టుకోలేక జనం ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. లంక నుంచి 19 మంది తమిళులు పడవలో ఆదివారం భారత్‌లోని ధనుష్కోటి తీరానికి చేరుకున్నారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు.