శ్రీరామనవమి రోజున జేఎన్‌యూలో ఘర్షణ

శ్రీరామనవమి రోజున ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ)లోని ఒక హాస్టల్ సమీపంలో కొందరు విద్యార్థులు ఉత్సవం జరుపుకొంటుండగా ఘర్షణ చెలరేగింది. ఆ హాస్టల్ లో మాంసాహారం తయారు చేయవద్దని దాడికి పాల్పడ్డారని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపిస్తుండగా, శ్రీరామనవమి ఉత్సవం భగ్నం చేసేందుకు దాడులకు పాల్పడినట్లు ఎబివిపి నాయకులు ఆరోపించారు. 
 
ఈ  ఘర్షణలో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. లోని కావేరీ హాస్టల్‌లో ఆదివారం రామనవమి రోజున మెస్‌లో మాంసాహారం అందించినందుకు రెండు గ్రూపుల విద్యార్థులు ఘర్షణకు దిగారు. హింసలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.అయితే ఇరువర్గాలకు చెందిన 60 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారని రెండు వర్గాల విద్యార్థులు పేర్కొన్నారు. 
 
హింసకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. అఖ్తరిస్తా అన్సారీ అనే విద్యార్థి తల నుంచి రక్తస్రావం అవుతున్నట్లు వీడియోలో కనిపించింది. కావేరీ హాస్టల్ మెస్‌లో మాంసాహారాన్ని వండి వడ్డించకుండా ఆపేందుకు ప్రయత్నించారని, రామనవమి పూజకు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించారని పరస్పరం ఆరోపణలు చేసుకొంటూ, విద్యార్థులు వాదోపవాదాలకు  దిగారు.

సాయంత్రం 4 గంటల నుంచి క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. వామపక్ష కార్యకర్తల అభిప్రాయం ప్రకారం, హాస్టల్ మెస్‌లో మాంసాహారాన్ని వండకుండా ఎబివిపి విద్యార్థులు  అడ్డుకోవడంతో వివాదం ప్రారంభమైంది. “ప్రతి ఆదివారం, అన్ని హాస్టళ్లలో మాంసాహారం, శాఖాహారం రెండూ వండుతారు. కావేరీ హాస్టల్ దగ్గర ఏబీవీపీ విద్యార్థులు ఏదో కార్యక్రమం నిర్వహిస్తుండగా, చికెన్ డెలివరీ చేసేందుకు వ్యాపారి రాగానే అడ్డుకున్నారు. హవాన్‌ నిర్వహిస్తున్నారని, మాంసాహారం వండడం కుదరదని చెబుతూ వారు అతడిని, మెస్‌ సెక్రటరీని వారు వేధించారు”.

అయితే ఇది మాంసాహారం సమస్య కాదని ఎబివిపి  కార్యకర్తలు స్పష్టం చేశారు. “ జేఎన్‌యూలోని సాధారణ విద్యార్థులు కావేరీ హాస్టల్‌లో రామనవమి హవనాన్ని నిర్వహిస్తున్నారు.  అయితే వామపక్ష విద్యార్థులు గందరగోళం సృష్టించి,  అది జరగకుండా నిరోధించడానికి, విద్యార్థులు ఎవ్వరు అక్కడకు చేరకుండా చేయడంకోసం వచ్చారని వారు ఆరోపించారు. 

 
ఇది మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, గందరగోళం కారణంగా సాయంత్రం 5 గంటలకు మాత్రమే ప్రారంభించగలిగామని చెప్పారు.  మాంసాహారానికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదని పేర్కొంటూ తమ కుయుక్తులను కప్పిపుచ్చుకోవడం కోసం ఈ వాదాన్ని సృష్టించారని విమర్శించారు.  హాస్టల్‌లో ఇఫ్తార్ పార్టీ, హవాన్‌లు ఏకకాలంలో జరుగుతున్నాయని పేర్కొంటూ లేని సమస్యను సృష్టించారని ఎబివిపి – జేఎన్‌యూకార్యదర్శి ఉమేష్ అజ్మీరా విమర్శించారు.

హింస చెలరేగడానికి కొంచెం ముందు రాత్రి 7 గంటలకు స్టూడెంట్స్ డీన్ సుధీర్ ప్రతాప్ సింగ్ ఓ దినపత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ ఇలా అన్నారు: “విద్యార్థుల మెస్ కమిటీలు ఏమి వండాలో నిర్ణయిస్తాయి. ఇందులో పరిపాలనకు ఎటువంటి పాత్ర లేదు. అధికారికంగా ఎటువంటి ఫిర్యాదు లేదు.  కానీ నాకు కాల్ వచ్చింది. వార్డెన్‌తో మాట్లాడాను. మెనూ ప్రకారమే  వండుతున్నారు. మాకు ఎటువంటి సమస్యలు లేవు. సమస్య పరిష్కరించబడింది. ”

ఏది ఏమైనప్పటికీ, ఉద్రిక్తత త్వరలో హింసాత్మకంగా మారింది, రెండు విద్యార్థి శిబిరాలు ఒకరిపై మరొకరు సాయంత్రం రాళ్లు, పూల కుండలను విసరడం ప్రారంభమైనట్లు ఆరోపించారు. రెండువైపులా గాయపడ్డారు. 

“ఇదంతా పధకం ప్రకారం అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారు.  విద్యార్థులు శాంతియుతంగా పూజలు నిర్వహించారు.  ఇఫ్తార్ విందు కూడా జరిగింది. చీకటి పడడంతో హింసకు దిగాలనుకున్నారు. మా జాయింట్ సెక్రటరీ వేలు విరిగింది. మరో కార్యకర్త తలపై పూల కుండ విరిగింది” అని ఏబీవీపీ జాతీయ మీడియా కోఆర్డినేటర్ సిద్ధార్థ్ యాదవ్ ఆరోపించారు.
 
రాత్రి 9:45 గంటలకు పరిస్థితి ప్రశాంతంగా మారిందని, ఆ సమయానికి పోలీసులు క్యాంపస్‌లో ఉన్నారని డీసీపీ సౌత్‌వెస్ట్ మనోజ్ సి తెలిపారు. ”రెండు విద్యార్థి సంఘాలు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాయి. ఫిర్యాదుల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. . మేము  జేఎన్‌యూ   పాలనా విభాగం  నుండి అనుమతి పొందిన తర్వాత ప్రాంగణంలోకి ప్రవేశించాము; పోలీసుల మేము పట్టించుకోలేదనడం అవాస్తవం” అని పేర్కొన్నారు. 

జేఎన్‌యూలో చివరి పెద్ద హింసాత్మక సంఘటన జనవరి 5, 2020న జరిగింది.  జనవరి 5 న సుమారు 100 మంది ముసుగులు ధరించిన వ్యక్తులు సుమారు నాలుగు గంటల పాటు యూనివర్సిటీ లోపల కర్రలు, రాడ్‌లతో విధ్వంసానికి పాల్పడ్డారు, ఇందులో 36 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం  అధ్యక్షురాలు ఐషే ఘోష్ కూడా గాయపడ్డారు.