అద్భుతమైన వ్యక్తిత్వం కస్తూర్బా సొంతం

డాక్టర్ నాగసూరి వేణుగోపాల్
 ఆకాశవాణి పూర్వ సంచాలకులు
భారతీయ మహిళా లోకానికి సరిగ్గా సరిపోయే ఆధునిక ఆదర్శమూర్తి కస్తూర్బా!  సాంప్రదాయాల శృంఖలాల నుంచి, చాకచక్యంగా తనను తానే మలచుకున్న మహిళామణి. ఎప్పటికప్పుడు సందర్భాన్ని బేరీజు వేసుకుని హేతుబద్ధతతో నిత్య స్పృహతో రాటుదేలిన పోరాటమూర్తి. ఎల్లప్పుడూ కొత్త విషయాన్ని హేతుబద్ధతతో పరిశీలించి పాటించిన ప్రాయోగిక వాది.

ఓ మహానుభావుడికి భార్య కావడం ఓ పెద్ద విషాదం –  అని రామకృష్ణ పరమహంస సతీమణి మాతా శారదాదేవి ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. జగజ్జ్యోతిగా వెలిగిన గాంధీజీ ఛాయలో కస్తూరిబా వివేకాన్ని, విజ్ఞతను, చాకచక్యాన్ని సాహసాన్ని, తెగువను, త్యాగాన్ని, గుర్తించలేకపోయాం.  నిజానికి ఏ కొలబద్దతో అధ్యయనం చేసినా కస్తూర్బా ఒక అద్భుతమైన స్ఫూర్తి కర్తగా కనబడతారు. 

 
గాంధీజీతో పాటు  కస్తూర్బాకు కూడా దాదాపు ఒకే సమయంలో 150వ జయంతి ఉత్సవాలు వచ్చినా కస్తూర్బా వ్యక్తిత్వాన్ని చర్చించిన సందర్భాలు కానీ, కొనియాడిన సన్నివేశాలు కానీ ఎక్కువ సంఖ్యలో మనకు తారసపడవు.  2020లో కస్తూర్బా గాంధీ ఎంబోడిమెంట్ ఆఫ్ ఎంపర్ మెంట్ పేరున  సిబి కె జోసఫ్  సాధికారమైన జీవిత చరిత్రను వెలువరించారు.

1869 ఏప్రిల్ 11న కస్తూర్బా జయంతి అని ఇప్పుడు రూఢి అయింది. అయితే కస్తూర్బా గాంధీ కంటే చిన్నది అని ఆమె తమ్ముడు మహదేవ్ దాస్ అనేవా   అయితే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అన్న లక్ష్మీదాస్ గాంధీ జాగ్రత్త చేసిన ఆధారాల ప్రకారం కస్తూర్బా, గాంధీజీ కంటే పెద్దది. వీరిద్దరి వయసు గురించి వారి మనవడు అరుణ్ గాంధీ చెప్పిన విషయం సరదా కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య నువ్వు పెద్ద, నువ్వు పెద్ద అని అప్పుడప్పుడు పరాచికాలు జరిగేవట.

కస్తూర్బా తండ్రి పేరు గోకుల్ దాస్ కపాడియా. ఆయన సంపదగల వ్యాపారవేత్త. అంతేకాకుండా పోర్బందర్ పట్టణానికి ఓ పర్యాయం మేయరుగా కూడా పనిచేశారు. తల్లి పేరు వ్రజ్కున్ వెర్బా. కస్తూర్బాకు ఇద్దరు అన్నలు, ఇద్దరు తమ్ముళ్ళు జన్మించినా చినరకు మిగిలింది మహదేవ్ దాస్ అనే తమ్ముడు మాత్రమే.  కస్తూర్బా కుటుంబం గాంధీజీ కుటుంబం ఒకే వీధిలో దగ్గర దగ్గరగా వుండేవి. 

 
మిత్రులైన గోకుల్ దాస్ కపాడియా, కరంచంద్ గాంధీ పిల్లల పెళ్ళి ద్వారా బంధువులుగా మారాలని నిర్ణయించుకున్నారు. గాంధీజీ, కస్తూర్బాలకు ఏడేళ్ళ వయసులో 1876లో నిశ్ఛితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థం గురించి తనకు తెలియదని గాంధీజీ తన ఆత్మకథలో రాశారు. పిల్లలకు తెలియకుండా పెద్దలు నిర్ణయించుకోవడం అప్పటి కాలానికి ఆశ్చర్యమేమీ కాదు. 
 
అయితే వారి పెళ్ళి 13 ఏళ్ళకు జరగడం గమనార్హం. అప్పటి కాలానికి ఈ వయసులో పెళ్ళి చేయడం ప్రగతిదాయకమైన పోకడే. అప్పటి కాలంలో పెళ్ళి సమయానికి వధూవరులిద్దరికీ పరస్పర పరిచయం వుండేది కాదు. కానీ, కస్తూర్బా గాంధీల విషయంలో అలా జరగలేదు. పెళ్ళికి ముందే స్నహితుల పిల్లలు కావడం వల్ల, ఒకే వీధిలో వుండడం వల్ల ఎంతో కొంత పరిచయం వుండడం అప్పటి కాలానికి అభ్యుదయమే.  
 
ఒకేసారి రెండు, మూడు పెళ్ళిళ్ళు కలిపి చేసి పెద్దలు ఖర్చు తగ్గించుకోవడం అనేది కూడా అప్పటి విధానం. 1882లో గాంధీ, గాంధీ అన్న, మోతీలాల్ అనే సమీప బంధువు – ఈ ముగ్గురి పెళ్ళిళ్ళను ఒకేసారి కరంచంద్ గాంధీ నిర్వహించారు. నిజానికి రాజ్ కోట సంస్థానంలో దివాన్ గా వున్న కరంచంద్ గాంధీ పెళ్ళికి పోర్ బందర్ వస్తూ ప్రమాదానికి గురయ్యారు. 
 
ఎలాగో అలాగ ఆయన పెళ్ళి సమయానికి రావడంతో సమస్య తీరింది. అప్పటి వరకూ పోర్బందర్ లో వున్న గాంధీ కుటుంబం పెళ్ళి తరువాత రాజ్ కోటకు తరలి వెళ్ళింది. సంపద గల కుటుంబంలో ఇద్దరు పిల్లల మధ్య ఒక్కర్తిగా పెరిగిన కస్తూర్బా బాల్యం ఆనందంగానే గడిచింది. ఆడపిల్లలని చదివించడం అప్పటి విధానం కాదు. 
 
అయిత్ గాంధీ మాత్రం తన ఆరవ ఏట నుంచి చదువుకున్నారు. 13వ ఏట పెళ్ళి తర్వాత గాంధీ చదువు కొనసాగించగా కస్తూర్బా అత్త పుతలీబాయికి చేదోడు వాదోడుగా వుండేది. గాంధీ తన భార్యను చదువుకోమని కొంత వత్తిడి చేసినా తోడికోడళ్ళు, ఇరుగు పొరుగు వారు పరాచికాలు ఆడతారని కస్తూర్బా  తటపటాయించేది. 
 
 వీరి పెళ్ళి జరిగిన మూడేళ్ళకు గాంధీ తండ్రి కరంచంద్ మరణం ఆశించని వైపరీత్యం. అదే సంవత్సరం గాంధీ, కస్తూర్బా దంపతులకు ఒక బిడ్డ జన్మించి కనుమూయడం ఇంకో విషాదం. దివానుగా ఆదాయం గడించే తండ్రి అర్థాంతరంగా కనుమూయడంతో ఆ కుటుంబం చిక్కుల్లో పడింది. 
 
గాంధీ అన్నలు ఇద్దరున్నా వారికి సరయిన ఆదాయం లేకపోయింది. గాంధీ తల్లి పుతలీబాయి కరంచంద్ గాంధీకి నాల్గవ భార్య. చాలా పేదరికం నుంచి వచ్చిన నేపథ్యం ఆమెది. కస్తూర్బాకు చదువు లేకపోయినా పుతలీబాయి నుంచి ఎన్నో సుగుణాలను తన ఎరుకతో గమనించి తను అలవరచుకున్నది. 
 
విజ్ఞత, ముందు చూపు,  బాధ్యతలను ఎరిగి ప్రవర్తించడం సద్దుకుపోవడం, నియమ నిష్ఠలతో జీవితం గడపడం వంటి ఎన్నో లక్షణాలను కస్తూర్బా అందిపుచ్చుకోవడం చాలా గొప్పగా అనిపిస్తుంది. గాంధీజీ సహచరిగా ఎన్నో ఆటుపోట్లను పెను ఉప్పెనలను కస్తూరిబా తరువాత కాలంలో తట్టుకుని నిలబడగలిగింది.

మామ చనిపోవడంతో తలెత్తిన పరిస్థితుల మధ్య గాంధీని బారిస్టర్ చదువు కోసం లండన్ పంపాలని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. అందరి ఇళ్ళలాగానే ఆ ఇంట్లో కూడా సదరు కోడలి నగలు అమ్మి, వచ్చిన డబ్బుతో కొడుకును లండన్ పంపారు. తరువాతి కాలంలో గాంధీ, కస్తూర్బా దంపతుల మనవరాలు సుమిత్రా కులకర్ణి వివరాలు సేకరించి సుమారు 273 తులాల బంగారం అమ్మారని ఒకచోట రాశారు. 
 
అప్పట్లో తులం బంగారం 11 రూపాయలు. సుమారు 3000 రూపాయలు వచ్చి వుండవచ్చని సుమిత్రా కులకర్ణి అంచనా. గాంధీ స్వీయచరిత్రలో కూడా సుమారు రెండు మూడు వేల రూపాయలు బంగారం అమ్మడం ద్వారా వచ్చిందని పేర్కొంటారు. గాంధీ చదువు కోసం బంగారాన్ని పోగొట్టుకున్న కోడలు కస్తూర్బాకు మరో ఎదురు దెబ్బ కుల బహిష్కారం. 
 
ఆనాటి కుల పెద్దలు గాంధీ సముద్ర ప్రయాణాన్ని అడ్డుకున్నా చదువుకు కులానికి సంబంధం ఏమిటని ఆయన లండన్ వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఆ కుల బహిష్కరణ ప్రభావాన్ని చవి చూసింది గాంధీ కుటుంబం, ముఖ్యంగా కస్తూర్బా. అప్పటికి కస్తూర్బాకు హరిలాల్ జన్మించి సుమారు 3 నెలలు అయి వుంటుంది. 
 
పుట్టింటికి కూడా వెళ్ళలేని దుర్భర స్థితి కస్తూర్బాది.  మళ్ళీ లండన్ నుంచి గాంధీ వచ్చిన తర్వాతనే కుల బహిష్కరణ సమస్యకు కొంత విరుగుడు లభించింది. 1891లో గాంధీ తల్లి పుతలీబాయి మరణం కస్తూర్బాను చాలా చలింపచేసింది. తల్లి మరణించిన తర్వాతనే గాంధీ తిరిగి రాగలిగారు. 
 
ఆయన బారిస్టరు చదువు పూర్తి చేసుకుని వచ్చినా సరయిన ఉద్యోగం దొరకలేదు. కథియవార్ ప్రాంతపు వైషమ్యాలకు గాంధీ సద్దుకుపోలేకపోయేవారు.  ఇటువంటి సమయంలో ఉపాధి కోసం గాంధీజీ దక్షిణాఫ్రికా పయనమయ్యారు. అలా వెళ్ళిన గాంధీజీ మూడేళ్ళకు కానీ తిరిగి రాలేదు. ఇలా సాగుతుంది కస్తూర్బా జీవనయానం.

మిత్రుల ఓడలో ఉచితంగా వెళ్ళే అవకాశం వుందని ఇద్దరు కుమారులు, మరో బంధువుల అబ్బాయితో కలిసి కస్తూర్బా దంపతులు దక్షిణాఫ్రికా ప్రయాణమయ్యారు. దక్షిణాఫ్రికా వెళ్ళిన కాలానికి కస్తూర్బా వయసు సుమారు 27 సంవత్సరాలు. వెళ్ళిన కొత్తలో పెద్ద ఇల్లు, అంతో ఇంతో సౌఖ్యం ఉండేది. 
 
గాంధీ అప్పటికి నిరాడంబర జీవితాన్ని అలవరుచుకోలేదు. తరువాతి దశలో కస్తూర్బా జీవితం మరింత విభిన్నంగా మారుతుంది. బీచ్గ్రో విల్లా ఇల్లు వదలి ఫినిక్స్ ఆశ్రమమంటూ గాంధీజీ చెరుకు తోటల్లో జనావాసం స్థాపించారు. కొంతకాలానికి కస్తూర్బా ఫినిక్స్ ఆశ్రమానికి తరలి వెళ్ళింది. తరువాత కాలంలో టాల్ స్టాయ్ ప్రభావంతో టాల్ స్టాయ్ ఫామ్ ప్రారంభించినపుడు కుటుంబం అక్కడికి మారింది. 
 
మామూలుగా వుండే ఇల్లు కాకుండా అందరితో కలిసి జీవనం సాగించే విధానానికి  కస్తూర్బా అలవరచుకోక తప్పలేదు. ఇంకోవైపు పిల్లల చదువు. అక్కడ యూరోపియన్ స్కూల్స్, క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ అని రెండే ఉండేవి. ఒకదానిలో భారతీయ సంతతివారికి ప్రవేశం లేకపోగా మరో విధానంలో స్థాయి లేని చదువు ఇతర భాషలో వుండేది. 
 
కనుక గాంధీ తన పిల్లలకు ఇటువంటి చదువు కాకుండా తనే చదువు చెప్తానని సిద్ధపడ్డారు. ఈ నిర్ణయం కస్తూర్బాకు ఒకవంక సంతోషాన్ని, ఇంకోవైపు అసంతృప్తిని కలిగించింది. గాంధీ లండన్ లో, దక్షిణాఫ్రికాలో వున్నప్పుడు పిల్లలకు తండ్రి దగ్గరుండేవాడు కాదు. కనుక ఇప్పుడు పిల్లలు తండ్రి వద్ద ఎక్కువ సమయం గడిపే అవకాశం వుందనీ కస్తూర్బా ఆనందపడ్డారు. 
 
అయితే ఫార్మల్ ఎడ్యుకేషన్ కోల్పోతున్నారని వ్యాకులపడ్డారు. స్థిరచిత్తుడైన గాంధీ కఠోర నిర్ణయాలు కస్తూర్బాను చాలా బాధపెట్టేవి. ఇంట్లో ఉన్న అతిథి కక్కసును నవ్వుతూ శుభ్రపరచలేదని గాంధీ గొడవపడ్డారు. ఈ సంఘటనలో భార్యాభర్తల మధ్య మాటామాటా వచ్చినా కస్తూర్బా చలించకుండా గాంధీ దుడుకుతనాన్ని ధృడంగానే ఎదుర్కొన్నారు. సహనంతోనే తిరస్కరించారు.
 
కస్తూర్బా పోరాడిన తీరు గాంధీజీ సత్యాగ్రహ భావనకు తుది రూపు ఇవ్వడానికి దారి చూపింది. హిందువుల వివాహాల్ని దక్షిణాఫ్రికాలోని బ్రిటీష్ ప్రభుత్వం గుర్తించడానికి నిరాకరిస్తే కస్తూర్బా నాయకురాలిగా మారి మిగతా మహిళలతోపాటు ఎదుర్కొని జైలుపాలయ్యారు. స్త్రీలు ఇలా ఉద్యమంలో పాల్గొనడం వల్ల పురుషులకు నచ్చచెప్పే అవసరం తగ్గిపోయిందని గాంధీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. 
 
 1913 నుంచి 1944 మధ్యకాలంలో సుమారు మూడు దశాబ్దాల పాటు కస్తూర్బా వివిధ పోరాటాల్లో పాల్గొన్నారు, అరెస్టు కూడా అయ్యారు. భారతదేశంలో గాంధీ చేపట్టిన తొలి ఉద్యమం చంపారణ్యంలో స్త్రీలకు పిల్లలకు విద్య, ఆరోగ్యానికి సంబంధించి అవగాహన కలిగించడంలో కస్తూర్బా పోషించిన పాత్ర చాలా కీలకమైనది. 1939లో రాజ్ కోట్ సంస్థానం దురాగతాలను ఎదుర్కోవడానికి కస్తూర్బా అరెస్టు కూడా అయ్యారు. 
 
1942 క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బ్రిటీష్ ప్రభుత్వం గాంధీని అరెస్టు చేస్తే బొంబాయిలో గాంధీ ప్రతినిధిగా కస్తూర్బా పెద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. పిల్లల చదువు, పెళ్ళిళ్ళు కస్తూర్బా కుటుంబంలో పెనుతుఫానులే రేపాయి. ముఖ్యంగా హరిలాల్ పోకడలు కస్తూర్బాను చివరి దాకా కలచివేశాయి. ఒక దశలో హరిలాల్ కు కస్తూర్బా ఒక పెద్ద బహిరంగ ఉత్తరమే రాయాల్సి వచ్చింది. 
 
గాంధీలాగా విదేశల చదువు, మహా రచయితల గ్రంథాల అధ్యయనం లేకున్నా కస్తూర్బా భర్త చేస్తున్న పని ఎందుకో ఏమిటో బాగా ఎరిగి మహత్తర త్యాగమూర్తిగా మిగిలిపోయింది. ఇంకో రకంగా చెప్పాలంటే ఎంతోమంది నాయకుల కన్నా విజ్ఞతగల అనుకూలవతి అయిన భార్య లభించడం గాంధీజీ అదృష్టం. ఏ రకంగా చూసినా గాంధీతో పలు రకాలుగా పోటీ పడదగ్గ గొప్ప వ్యక్తిత్వంగల అద్భుతమైన మహిళ కస్తూర్బా.