సంజయ్ పాదయాత్రకు డిజిపి అనుమతి కోరిన బిజెపి 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ నెల 14వ తేదీనుంచి చేపట్టనున్న ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతించాల‌ని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర నేతలు వినతి పత్రం అందించారు. డీజీపీ కార్యాలయంలో శుక్రవారం మహేందరెడ్డిని బీజేపీ నేతలు, మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్‌, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, పాదయాత్ర ప్రముఖ్‌ గంగిడి మనోహర్‌రెడ్డి, సహ ప్రముఖ్‌ తూళ్ళ వీరేందర్‌ గౌడ్‌ తదితరులు కలిశారు.
14వ తేదీ నుంచి ఆలంపూర్‌ జోగులాంబ దేవాలయం నుంచి సంజయ్‌ రెండవ విడత పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రకు తగిన భద్రత కల్పించాలని నేతలు డీజీపీని కోరారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు ఈ యాత్ర జరుపుతున్నామని, మొదటి విడత యాత్ర ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించామని గుర్తు చేశారు.
కొంత కాలంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దౌర్జన్యాలకు దిగుతూ ప్రజల్లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని, దాడులు చేయాలంటూ శ్రేణులను రెచ్చగొడుతుందని డీజీపీ సమర్పించిన వినతి పత్రంలో నేతలు గుర్తు చేశారు.  దాడులకు తావు లేకుండా ప్రశాంతంగా యాత్ర జరిగేందుకు కావాల్సిన పోలీసు బందోబస్తును కల్పించాలని వారు కోరారు. యాత్రపై దాడులు చేసేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు కుట్ర చేసే అవకాశాలున్నాయని, శాంతియుతంగా యాత్ర జరిగేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.