`వివక్షత’ కారణంగా ప్రధాని కాలేకపోయిన బాబు జగ్జీవన్ రామ్

* జన్మజయంతి నివాళి 
 
డా. టి ఇంద్రసేనారెడ్డి,
సామజిక, పర్యావణ శాస్త్రవేత్త 
 
స్వతంత్ర భారత దేశంలో తమ ప్రతిభతో, అట్టడుగు వర్గాల నుండి వచ్చి అత్యున్నత స్థానాలకు ఎదిగినా అనేకమంది నాయకులు `వివక్షత’ను పూర్తిగా అధిగమించలేకపోయారు. డా. బి ఆర్ అంబెడ్కర్ నుండి బంగారు లక్ష్మణ్ వారు ఆ విధంగా కుట్రపూరిత రాజకీయాలకు గురయిన అనేకమంది నేతలు మనకు కనిపిస్తారు. అటువంటి వారిలో అగ్రగణ్యులలో ఒకరు మాజీ ఉపప్రధాని బాబు జగజీవన్ రామ్ అని చెప్పవచ్చు. 
 
సుదీర్ఘకాలం, నాలుగు దశాబ్దాలపాటు మంత్రిపదవులలో ఉంటూ అత్యుత్తమ పరిపాలన  దక్షునిగా, ప్రజా నాయకుడిగా పేరొందిన 1977 ఎన్నికలలో అధికారమలోకి వచ్చిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంలో అధికార కూటమికి చెందిన సుమారు 300 మంది పార్లమెంట్ సభ్యులలో 200 మంది వరకు బలపరిచిన ఆయన ప్రధాని కాలేకపోవడం శృతిమించిన `వివక్షత’ రాజకీయాలకు ప్రబల నిదర్శనం. ఆ తదుపరి 1980 ఎన్నికలలో జనతా పార్టీ ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన ఎన్నికలకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. 
 
`వివక్షత’ కారణంగానే అంతటి మహోన్నత నాయకుడు ప్రధాని కాలేక పోయారని ప్రముఖ ఆర్ ఎస్ ఎస్ నేత యాదవరావు జోషి ఆ సందర్భంగా ఒక సభలో ఆవేదన వ్యక్తం చేశారు. 1946లో జవహర్ లాల్ నెహ్రు ఏర్పాటు చేసిన  తాత్కాలిక ప్రభుత్వంలో అత్యంత పిన్నవయస్కుడే కాకుండా బీహార్ లోని వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త కూడా అఆయన.
నలభై ఏళ్ల పాటు భారత పార్లమెంట్ లో వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా కూడా వ్యవహరించారు. భారత రాజ్యాంగ పరిషద్ సభ్యునిగా  భారత రాజ్యాంగంలో ప్రతిష్టాత్మకమైన సామాజిక న్యాయం సూత్రాల ప్రాముఖ్యత పై చాలా బలమైన ప్రాధాన్యత ఇచ్చిన కొద్ది మందిలో ఆయన ఒకరు. అశృస్యుతల సమానత్వం కోసం 1935లోనే అఖిల భారత అణగారిన వర్గాల లీగ్ ను ఆయన ఏర్పాటు చేశారు. 1937లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికైన ఆయన  గ్రామీణ పేదలను సంఘటిత పరచడం ప్రారంభించారు.
దేశపు మొదటి కార్మిక మంత్రి కాగా, భారత్ నిర్ణయాత్మక విజయం సాధించిన 1971లోని భారత్ – పాకిస్థాన్ యుద్ధం సమయంలో ఆయన కీలకమైన రక్షణ మంత్రిగా ఉన్నారు. రెండు సార్లు కేంద్రంలో వ్యవసాయ మంత్రిగా ఉంటూ దేశంలో హరిత విప్లవానికి, వ్యవసాయంలో ఆధునికతకోసం విశేషంగా కృషి చేశారు.

జగ్జీవన్ రామ్ బీహార్ రాష్ట్రంలోని చాంధ్వా అనే చిన్న గ్రామంలో శోభిరామ్, వసంతిదేవి దంపతులకు 1908 ఏప్రిల్ 5 న జన్మించారు. వీళ్ళకి వ్యవసాయ భూములు ఉండేవి. జగ్జీవన్ రామ్ కి ఒక అన్నయ్య, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. అతను పిన్న వయసులోనే వినయపూర్వకమైన సామాజిక ఆరంభాలను కల్గి ఉన్నారు. 
 
1914 లో స్థానిక పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించిన తర్వాత తన తండ్రి దురదృష్టకరమైన మరణం తర్వాత మిడిల్ స్కూల్కి వెళ్లి తర్వాత ఉన్నత విద్యను సాధించాడు. తర్వాత 1922లో అర్రా టౌన్ స్కూల్లో చేరాడు. తన తల్లి సాటి లేని ప్రేమ,  మార్గదర్శకత్వంలో బాబు జగ్జీవన్ రామ్ తన మెట్రిక్యులేషన్ మొదటి భాగాన్ని విజయవంతంగా పూర్తి చేసి, . బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి కలకత్తా విశ్వవిద్యాలయంలో చేరి 1931లో సైన్సు లో బ్యాచిలర్ డిగ్రీపొందారు. 
 
చదువుకునే వయసులోనే కులవివక్ష సామాజిక అసమానతల మొదటి అనుభవం ఇవన్నీ జగ్జీవన్ రామ్ జీవితంలో తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అంతే కాకుండా పాఠశాల రోజులలో మతపరమైన విభజనకు, అంటరానితనానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేసిన సంఘటనలకు జగ్జీవన్ రామ్ ప్రసిద్ధి చెందారు. జగ్జీవన్ రామ్ జీవితంలో ఆయన తండ్రి కీలకపాత్ర పోషించారు. తన తండ్రి నుండి మానవతావాదం, ఆదర్శవాదం, స్థితిస్థాపకత  విలువలను నేర్చుకున్నారు . 

జగ్జీవన్ రామ్ జీవితంలో తన పట్ల చూపించిన కులావివక్షత కారణంగా సామాజిక అసమానత, ఇతరుల పట్ల దాని దుష్ప్రవర్తనలకు వ్యతిరేకంగా చాలా గంబీరంగా ఉండేవారు. అంటరానితనం దురాచారాన్ని  నిర్మూలించడానికి మహాత్మా గాంధీ చేసిన ప్రయత్నాలలో ఆయన  పాల్గొన్నారు. తర్వాత భారత స్వాతంత్రం కోసం స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. జూలై 1935 న జగ్జీవన్ రామ్ డాక్టర్ బతుకు మారితే ఇంద్రాణి దేవిని వివాహం చేసుకున్నారు.
ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన కుమార్తె మీరా కుమారి లోక్ సభ స్పీకర్ గా, కేంద్ర మంత్రిగా పనిచేశారు.
 
స్వతంత్ర పోరాటంలో పలు పర్యాయాలు జైలుకు కూడా వెళ్లారు. రెండో ప్రపంచ యుద్ధంలో భారత్ బ్రిటిష్ పక్షాన పాల్గొనడాన్ని విమర్శించినా ప్రముఖ నాయకులలో ఆయన ఒకరు. 1969లో కాంగ్రెస్ లో చీలిక ఏర్పడినప్పుడు ఇందిరా గాంధీ పక్షాన  ఉంది, ఆ పక్షంపై  పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1977లో ఎన్నికలకు ముందు ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు రాజీనామా చేసి మద్దతు ప్రకటించడం ద్వారా జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 
 
మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో చేరడానికి నిరాకరించి,  ప్రమాణస్వీకారంకు దూరంగా ఉన్నప్పటికీ ఒక వ్యక్తిగా కాకుండా, ఒక `రాజకీయ, సామజిక శక్తిగా’ ప్రభుత్వంలో ఉండడం అవసరమని జయప్రకాశ్ నారాయణ్ ఒప్పించడంతో చేరి, రక్షణ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఉపప్రధానిగా అయ్యారు. 1952లో జరిగిన మొదటి ఎన్నికల నుండి 1986లో మృతి చెందేవరకు లోక్ సభ సభ్యునిగా ఉంటూ రికార్డు సృష్టించారు.

ఆయన భారతదేశంలో ఎక్కువ కాలం క్యాబినెట్ మంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు : 1946-52 వరకు కార్మిక మంత్రి, 1952-56 కేంద్ర సమాచార శాఖ మంత్రి, 1956-62 కేంద్ర రవాణా, రైల్వే శాఖ మంత్రి, 1962-63 కేంద్ర రవాణా, సమాచార శాఖ మంత్రి, 1966-67 కేంద్ర కార్మిక, ఉపాధి , పునరావాస మంత్రి, 1967-70 కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖ మంత్రి,1974-77 వ్యవసాయ, నీటి పారుదల శాఖ మంత్రి, 1977-79 భారత ఉప ప్రధానమంత్రి. బాబు జగ్జీవన్ రామ్ 1986 జులై 6 న తుదిశ్వాస విడిచారు.