వేగంగా వ్యాపిస్తున్న మరో కొత్త వేరియంట్

కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితుల నుంచి ప్రపంచం క్రమంగా కోలుకుంటున్న వేళ కరోనా  కొత్త వేరియంట్ వచ్చిందన్న వార్త గుబులు రేపుతోంది. ఎక్స్ఈగా పిలుస్తున్న ఈ వేరియంట్  ఒమిక్రాన్ కంటే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తెలిపింది. కరోనా బీఏ2 ఒమిక్రాన్ తో పోల్చుకుంటే ఈ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని హెచ్చరించింది. 
 
ఎక్స్ఈ వేరియంట్ వృద్ధిరేటు 10 శాతం ఉందని డబ్ల్యూహెచ్వో తన ఎపిడెమియోలాజికల్ నివేదికలో వెల్లడించింది. ఎక్స్ఈను యూకేలో జనవరి 19న తొలిసారి కనుగొన్నామని, 600 కంటే ఎక్కువ ఎక్స్ఈ కేసులు నిర్ధారణ అయ్యాయని తెలిపింది. ఇప్పుడు అమెరికాలో ఎక్కువ సంఖ్యలో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయని వెల్లడించింది. 
 
 పబ్లిక్ హెల్త్ రిస్క్‌ను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ మెడికల్ అడ్వైజర్ సుసాన్ హాప్కిన్స్ చెప్పారు. ఎక్స్ఈతోపాటు ఎక్స్డీ, ఎక్స్ఎఫ్ అనే మరో రెండు వేరియంట్లు కూడా కనుగొన్నామని పేర్కొన్నారు. అయితే ఈ మూడు హైబ్రిడ్ వేరియంట్లలో ఎక్స్‌ఇ, ఎక్స్ ఎఫ్ రకాలు మాతృవైరస్ మాదిరిగానే ప్రపర్తించే అవకాశం ఉందని ప్రముఖ వైరాలజిస్ట్ టామ్ పీకాక్ వెల్లడించారు.
 
 ఎక్స్ డి మాత్రమే కొంత ఆందోళనకరమైనదని, ఇప్పటికే జర్మనీ, నెదర్లాండ్, డెన్మార్క్ దేశాల్లో వెలుగు చూసిందన్నారు. అయితే వీటి ప్రభావాలపై ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం లేనప్పటికీ వాటిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నామని తెలిపారు.
బూస్టర్ డోస్ తప్పనిసరి 
ఇలా ఉండగా, కరోనా కట్టడికి పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఆరు నెలల తరువాత యాంటీబాడీల తటస్థీకరణ స్థాయిలో క్షీణిస్తున్నాయని, అందువల్ల బూస్టర్ డోసు తప్పనిసరి అవుతోందని పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి) అధ్యయనం వెల్లడించింది. 
 
భిన్నమైన టీకా నియమావళిని అనుసరించి మొదటి డోసుగా కొవిషీల్డ్, రెండో డోసుగా కొవాగ్జిన్ ఇవ్వడం వల్ల డెల్టాతోపాటు ఇతర కరోనా వేరియంట్లకు వ్యతిరేకంగా యాంటీబాడీల తటస్థీకరణ ప్రభావం బాగా కనిపించిందని ఎన్‌ఐవి శాస్త్రవేత్త డాక్టర్ ప్రగ్యాయాదవ్ తెలిపారు. 
 
ఈ అధ్యయనం ఇటీవల జర్నల్ ఆఫ్ ట్రావెల్ మెడిసిన్‌లో ప్రచురణ అయింది. మూడు గ్రూపుల వారీగా ఈ అధ్యయనం సాగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 18 మందిని తీసుకుని వారికి భిన్నమైన టీకా నియమావళి ప్రకారం కొవిషీల్డు మొదటి డోసుగా, కొవాగ్జిన్ రెండో డోసుగా ఇచ్చి పర్యవేక్షించారు.