భారత్-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందంతో 10 లక్షల ఉద్యోగాలు

 
ఆస్ట్రేలియాతో శనివారం కుదుర్చుకున్న ఒప్పందం వల్ల రానున్న నాలుగైదు సంవత్సరాల్లో దాదాపు 10 లక్షల ఉద్యోగావకాశాలు కొత్తగా వస్తాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్యం 27 బిలియన్ డాలర్ల నుంచి 45-50 బిలియన్ డాలర్లకు పెరగడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని పేర్కొన్నారు.
భారత్, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రులు నరేంద్ర మోదీ, స్కాట్ మారిసన్ల సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు పీయూష్ గోయల్, డాన్ టెహాన్ ఇండియా-ఆస్ట్రేలియా ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్‌పై శనివారం సంతకాలు చేశారు. వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందం కుదిరింది.
అనంతరం పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సహకార స్ఫూర్తి, ఐక్యతలకు ఈ ఒప్పందం చిహ్నమని చెప్పారు. ఇది భారతదేశానికి చరిత్రాత్మక రోజు అని చెప్పారు. అతి పెద్ద అభివృద్ధి చెందిన దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడం ఓ దశాబ్దంలో  ఇదే తొలిసారి అని చెప్పారు.
రానున్న నాలుగైదు సంవత్సరాల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం ప్రస్తుత 27 బిలియన్ డాలర్ల నుంచి 45-50 బిలియన్ డాలర్లకు పెరగవచ్చునని, తద్వారా సుమారు 10 లక్షల ఉపాధి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. సేవా రంగంలో కూడా ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయని చెప్పారు.
భారతీయ వంటకాలు చేసేవారికి, యోగా శిక్షకులకు రానున్న సంవత్సరాల్లో నూతన అవకాశాలు వస్తాయని చెప్పారు. ఆస్ట్రేలియా వెళ్ళాలనుకునే భారతీయులకు రెండేళ్ళ నుంచి నాలుగేళ్ళ వరకు పోస్ట్ స్టడీ వర్క్ వీసాల జారీ కూడా ఈ ఒప్పందంలో భాగమేనని తెలిపారు.
ఆస్ట్రేలియాలో సుమారు ఓ లక్ష మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారని చెప్పారు. పర్యటక రంగాన్ని ప్రోత్సహించేందుకు వర్క్, హాలిడే వీసాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణిత శాస్త్రాల్లో గ్రాడ్యుయేట్లకు పోస్ట్ స్టడీ వర్క్ వీసాల జారీకి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
వాణిజ్యపరమైన అడ్డంకులను తొలగించడం వల్ల జౌళి, ఔషధ, తోలు వంటి రంగాలకు మంచి అవకాశాలు వస్తాయని చెప్పారు. ఇంజినీరింగ్ వస్తువులు, ఆటోమొబైల్ వంటి రంగాలు పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతాయని తెలిపారు. వచ్చే వారం తాను ఆస్ట్రేలియాలో పర్యటిస్తానని, ఆ దేశంలోని వ్యాపార దిగ్గజాలతోనూ, భారత దేశ వ్యాపార ప్రతినిధులతోనూ చర్చిస్తానని వెల్లడించారు.