వన్నియార్ లకు రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం… సుప్రీం స్పష్టం 

తమిళనాడు ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. అత్యంత వెనుకబడిన వర్గాలు, ఎంబీసీలకు ఇచ్చే 20 శాతం రిజర్వేషన్లలో.. 10.5 శాతాన్ని వన్నియార్ కమ్యూనిటీకి కల్పిస్తూ తమిళనాడు అసెంబ్లీలో చట్టం చేశారు. ఆ చట్టాన్ని మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. 

మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తమిళ సర్కార్ చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ స్థాయిలో ఓ వర్గానికి రిజర్వేషన్ ఇవ్వడం కుల, మత, లింగ భేదాలతో సంబంధం లేని సమానత్వ హక్కుకు వ్యతిరేకమని కోర్టు వ్యాఖ్యానించింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16కు విరుద్ధమని పేర్కొంది.

ఇకపోతే, గతేడాది ఫిబ్రవరిలో అన్నాడీఎంకే ప్రభుత్వం వన్నియార్ రిజర్వేషన్ చట్టంను ఆమోదించింది. ఏప్రిల్ లో ఎన్నికల  కోడ్ పెడతారనే ఉద్దేశంతో హడావుడిగా ఫిబ్రవరిలో అప్పటి సర్కార్ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం ఈ కోటాను అమలు చేస్తోంది.

అయితే ఈ చట్టాన్ని మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. కానీ అసెంబ్లీలో పూర్తి మెజార్టీతో తీసుకొచ్చిన చట్టంను ఎలా రద్దు చేస్తారంటూ పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) పార్టీ అధినేత ఎస్. రామదాస్ సుప్రీంను ఆశ్రయించారు. విచారణల తర్వాత ఎంబీసీల్లో వన్నియార్లను ప్రత్యేక గ్రూపుగా పరిగణించేందుకు అవసరమైన డేటాను అందించడంలో తమిళనాడు సర్కారు విఫలమైనదని ధర్మాసనం తెలిపింది.

కాగా, తమిళనాడులో అత్యధిక జనాభా కలిగిన బీసీ కమ్యూనిటీగా వన్నియార్లను చెబుతారు. ఈ కమ్యూనిటీకి చెందిన వారికి రాజకీయంగానూ మంచి పలుకుబడి ఉండటం గమనార్హం. మొత్తంగా తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు ఉండగా వారిలో 30 శాతం బీసీల కులాలకు, 20 శాతం ఎంబీసీలకు, 18 శాతం ఎస్సీలకు, 1 శాతం గిరిజన తెగలకు ఉంది.