ఉద్రికతలకు దారితీసిన కేజ్రీవాల్ ఇంటి వద్ద బిజెపి నిరసన 

‘కశ్మీర్ ఫైల్స్’ ఓ బూటకపు సినిమా అని వ్యాఖ్యానించిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌‌కు బీజేపీ నుంచి నిరసన సెగ తగిలింది. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు బుధవారం ఐపీ కళాశాల నుంచి కేజ్రీవాల్ నివాసం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్రిక్తలు నెలకొన్నాయి. 
 
కేజ్రీవాల్ నివాసం వద్ద బీజేపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారని ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ట్వీట్‌లో ఆరోపించింది. కేజ్రీవాల్ నివాసంపై బీజేపీ దాడి చేసినట్లు తెలిపింది. సెక్యూరిటీ బ్యారియర్స్‌, సీసీటీవీలు, కెమెరాలు, ఇంటి ముందు ద్వారాన్ని విరగ్గొట్టారని తెలిపింది.
 
 బీజేపీకి చెందిన ఢిల్లీ పోలీసుల సంపూర్ణ సహకారంతో ఈ విధ్వంసం సృష్టించారని ఆరోపించింది. ఇదంతా కశ్మీరు పండిట్లకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేసినందుకా? అని ప్రశ్నించింది. 
 
కొద్ది రోజుల క్రితం కేజ్రీవాల్ ఢిల్లీ శాసన సభలో మాట్లాడుతూ, కశ్మీర్ ఫైల్స్ సినిమా ఓ బూటకపు సినిమా అని ఆరోపించారు. ఈ సినిమాకు పన్నులను మినహాయించాలని బీజేపీ డిమాండ్ చేయడాన్ని తప్పుబట్టారు. ఈ సినిమాను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాలని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిని బీజేపీ కోరాలని హితవు చెప్పారు. 
 
 యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే ఈ సినిమా అందరికీ ఉచితంగా అందుతుందని ఎద్దేవా చేశారు. కశ్మీర్ ఫైల్స్ వంటి బూటకపు చిత్రాన్ని ప్రచారం చేయడం మానుకోవాలని బీజేపీ నేతలను కోరారు.  కేజ్రీవాల్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. 
 
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఓ ట్వీట్‌లో కేజ్రీవాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం అనేక బాలీవుడ్ సినిమాలకు పన్నులను మినహాయించిందని, కశ్మీరు హిందువుల మారణకాండను వెలుగులోకి తీసుకొచ్చిన చిత్రాన్ని కేజ్రీవాల్ ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఇచ్చిన ట్వీట్‌లో, కేజ్రీవాల్ వ్యాఖ్యలతో తనకు నోట మాట రావడం లేదన్నారు. 
 
ఈ నిరసన ప్రదర్శనకు నేతృత్వం వహించిన బీజేపీ ఎంపీ, యువమోర్చ అధ్యక్షుడు  తేజస్వి సూర్య  మాట్లాడుతూ, ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాకు పన్ను రాయితీని ఇవ్వడానికి నిరాకరించడం మాత్రమే కాకుండా, కశ్మీరులో హిందువుల ఊచకోతను కేజ్రీవాల్ ఎగతాళి చేస్తున్నారని ఆరోపించారు. 
 
దీంతో తాను ఎవరివైపు ఉన్నారో ఆయన స్పష్టం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఉగ్రవాదులవైపు ఉన్నారన్నారు. ఈ అమానుష క్రూరత్వానికి ఆయన రాజకీయంగా భారీ మూల్యం చేల్లించుకుంటారని హెచ్చరించారు.