పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక

పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని శ్రీలంక విలవిలలాడుతోంది. రోజుకు పది గంటల పాటు కరెంటు కోతలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాణాధార మందుల కొరత, అనస్తీషియా, శస్త్రచికిత్సకు అవసరమైన ఇతర పరికరాలు లేక వాయిదాపడుతున్న ఆపరేషన్లు, కాగిత నిల్వలు ఖాళీ అవడంతో నిలిచిపోయిన విద్యార్ధుల పరీక్షలు.. ఇదీ నేటి శ్రీలంక దుస్థితి. 
 
1948లో స్వాతంత్య్రానంతర శ్రీలంక చరిత్రలో ఇంతటి ఇంతటి దారుణమైన పరిస్థితి ఇదివరకెన్నడూ లేదు. ప్రభుత్వాసుపత్రులకు మందులు సరఫరా చేసే సప్లయర్ల బిల్లులు 6 మాసాలుగా చెల్లించలేదు. ప్రాణాధార ఔషధాల ధరలను 30 శాతం పెంచారు. వైద్య పరికరాలు , స్టెంట్స్‌ వంటివి అందుబాటులో లేని పరిస్థితి. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 19.4 శాతానికి, ఆహార ద్రవ్యోల్బణం 24 శాతానికి పెరిగిపోయాయి. 
 
తినడానికి, తాగడానికి కూడా చూసుకోవాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇంధనం కోసం రోజంతా బారులు తీరిన క్యూలైన్లలో నిలబడి సొమ్మసిల్లుతున్నారు. దీంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ మారక నిల్వలు ఒట్టిపోవడం, డాలర్‌తో కరెన్సీ మారకుపు విలువ గణనీయంగా పడిపోవడం, కార్పొరేట్లపై పన్నులు తగ్గింపు, కరోనా మహమ్మారి దెబ్బకు టూరిజం పరిశ్రమ చితికిపోవడం వంటివి శ్రీలంక ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. 
 
విదేశీ మారక నిల్వలు అడుగంటిపోవడంతో ముఖ్యమైన దిగుమతులు ఆగిపోయాయి. ఇది ఆహారం, మందుల కొరతకు దారి తీసింది. వీటి కోసం రేషన్‌ దుకాణాల ఎదుట చాంతాడంత క్యూలు ఉంటున్నాయి. ఇంధనం కోసం వేచివుంటున్న క్యూలు ఒకరి కష్టసుఖాలు మరొకరు చెప్పుకునే వేదికలుగా మారుతున్నాయి. విపత్తు నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటుతుంటే కుటుంబాలను ఎలా పోషించాలని తలలు పట్టుకుంటున్నారు.పెట్రోల్‌, డీజిల్‌ వంటి ఇంధనాల కొరత తీవ్రంగా వుండడంతో ఓడరేవుల వద్ద గల ట్రక్కులు ఆహార పదార్ధాలను, సిమెంటు వంటి ఇతర నిర్మాణ సామాగ్రిని పట్టణ కేంద్రాలకు తీసుకెళ్లలేక పోతున్నాయి. తేయాకు తోటల నుండి ఆకులను తీసుకురాలేకపోతున్నారు.
 
 అంతర్జాతీయ ద్రవ్య నిది (ఐఎంఎఫ్‌) బెయిలవుట్‌ కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చైనా, భారత్, బంగ్లాదేశ్‌ కొంతవరకు ఆర్థిక సాయం అందించాయి. ఈ ఏడాది శ్రీలంక చెల్లించాల్సిన విదేశీ అప్పు 400 కోట్ల డాలర్లు. వాటిని చెల్లించే స్థితి లేదు. ఐఎంఎఫ్‌ నుంచి ఎస్‌డిఆర్‌ వాటా కింద 65వేల కోట్ల డాలర్లు రావాల్సి ఉండగా 78.7 కోట్ల డాలర్లు మాత్రమే విదిల్చింది.