విశాఖలో మెట్రో కోసం ఏపీ నుండి ప్రతిపాదనే లేదు!

ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ కోసం ఏపి ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనను సమర్పించలేదని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో బీజేపీకి ఎంపి జివిల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ ఆ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

మెట్రో రైలు ప్రాజెక్ట్‌ కోసం 2017లో ప్రతిపాదనను సమర్పించాలని ఏపిని కోరామని, ఇప్పటివరకూ ఎటువంటి ప్రతిపాదన రాలేదని ఆయన తెలిపారు. రూ.12,345 కోట్లతో 42.55 కిలోమీటర్ల పొడవుతో మెట్రో రైలు నెట్‌వర్క్‌ కోసం గతంలో ప్రతిపాదనను ఏపి సమర్పించిందని తెలిపారు. తర్వాత దానిని కొనసాగించలేదని పేర్కొన్నారు. 

కాగా, భోగాపురం గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయం అంచనా వ్యయం రూ.2,500 కోట్లు అని పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి వి.కె సింగ్‌ తెలిపారు. ఎంపి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కరోనా వల్ల ఏర్పడ్డ ఆటంకాలతో 2020-21లో విమానయాన సంస్థలకు రూ.19,564 కోట్లు, విమానాశ్రయాలకు రూ.5,116 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఎంపి సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 

ప్రధానమంత్రి ఉపాధిహామీ పథకం (పిఎంఇజిపి) కింద ఆంధ్రప్రదేశ్‌లో 2021-22లో 2,161 ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు రూ.89.24 కోట్లు రాయితీ కింద విడుదల చేశామని, 17,288 మందికి ఉపాధి లభించిందని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భానుప్రతాప్‌ సింగ్‌ వర్మ తెలిపారు. 

రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2023లో రాష్ట్రంలో 78,770 యూనిట్ల స్థాపనకు రూ.2,550 కోట్లు రాయితీగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

కృష్ణా-గోదావరి (కేజీ) బేసిస్‌లో ఒఐఎల్‌, ఒఎన్‌జిసి, రిలయన్స్‌ ఇండియా లిమిటెడ్‌, వేదాంత లిమిటెడ్‌ కలిపి 198 చోట్ల ఆయిల్‌/గ్యాస్‌ నిల్వలను గుర్తించినట్లు పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి తెలిపారు. రాజ్యసభ సభ్యుడు జివిఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

కేజీ బేసిన్‌లో అన్వేషణకు వివిధ కంపెనీలు ఇప్పటి వరకు రూ. 11,643.08 మిలియన్‌ డాలర్లు వెచ్చించినట్లు మంత్రి పేర్కొన్నారు. విశాఖపట్నం రిఫైనరీ మోడర్నైజేషన్‌ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని హెచ్‌ఎపిసిఎల్‌ రూ.20,928 కోట్ల నుంచి రూ.26,264 కోట్లకు పెంచినట్లు పెట్రోలియం, సహజవాయువుల శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి తెలిపారు.

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2020 జులైలో పనులు పూర్తి చేయాల్సి ఉన్నా ప్రస్తుతానికి 85.8 శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. పనులు పూర్తి గడువును 2022-23 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి సవరించినట్లు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 11 మంది రాజ్యసభ ఎంపిలకు ఎంపిల్యాడ్స్‌ కింద రూ.242 కోట్లు కేటాయించగా రూ.83 కోట్లు విడుదల చేశామని కేంద్ర ప్రణాళిక, గణాంకాల శాఖ మంత్రి రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌ తెలిపారు.