రష్యా నుంచి భారత్ కు 45,000 టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్

రష్యా నుంచి 45,000 టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను అత్యధిక ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం చేసుకుంది. ఏప్రిల్‌లో సరుకు భారత్‌కు చేరుకుంటుంది. 
 
యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుంచి సరఫరాలు నిలిచిపోవడంతో స్థానిక మార్కెట్‌లో వంటనూనెల ధరలు భారీగా పెరిగిపోయాయని, దీంతో రష్యా నుంచి పెద్దమొత్తంలో కొనుగోలుకు భారత్ ఆర్డర్ ఇచ్చిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 
 
పామాయిల్ సరఫరాలను పరిమితం చేయాలని ఇండోనేషియా నిర్ణయం  తీసుకోవడం, సౌత్ అమెరికాలో సోయా బీన్ సాగు తగ్గడంతో కూడా వంటనూనెల లభ్యత తగ్గిందని, రష్యా నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకోవడం ద్వారా వంటనూనెల కొరతను కొంతమేర అధిగమించవచ్చని ఆ వర్గాలు తెలిపాయి.
 
ఓడల్లో లోడింగ్ ఉక్రెయిన్‌లో సాధ్యం కానందున కొనుగోలు దారులు రష్యా నుంచి కొనుగోలుకు ప్రయత్నిస్తున్నట్టు జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరి చెప్పారు. ఏప్రిల్‌లో 12,000 టన్నుల  షిప్‌మెంట్ కోసం ఈ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ముందు షిప్‌మెంట్ టన్నుకు 1,630 డాలర్లు ఉండగా, ఏప్రిల్‌లో రష్యా నుంచి షిప్‌మెంట్‌కు టన్నుకు 2,150 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.