హైదరాబాద్‌ పుదుచ్చేరిల మధ్య నేరుగా విమానం

హైదరాబాద్‌ పుదుచ్చేరిల మధ్య ప్రారంభమైన తొలి డైరెక్ట్ విమానంలో తెలంగాణ గవర్నర్, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం ప్రయాణించారు. హైదరాబాద్ పుదుచ్చెరి ల మధ్య విమాన సర్వీసులు ప్రారంభించే విషయంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సమన్వయం చేస్తూ ఆమె ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

ఈ విమాన సర్వీసులు ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ విమాన సర్వీసులు ప్రారంభానికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీకి, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కృతజ్ఞతలు తెలిపారు. పుదుచ్చేరి లోని అందమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించటానికి తెలంగాణ ప్రజలు ఇష్టపడతారని, అలాగే హైదరాబాద్ బిర్యానీ రుచి కోసం, పుదుచ్చేరి ప్రజలు ఇక్కడకు వస్తారని గవర్నర్ పేర్కొన్నారు.

ఈ విమాన సర్వీస్ ప్రారంభం వల్ల ఇరు ప్రాంతాల ప్రజల మధ్య సంబంధాలు మరింత మెరుగవుతాయని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు. మొదటిసారిగా పుదుచ్చేరి-హైదరాబాద్ డైరెక్ట్ విమాన సర్వీసు సాకారంలో కృషి చేసిన గవర్నర్‌కు ప్రయాణికులు, మీడియా, రాజ్ భవన్ సిబ్బంది హార్దిక స్వాగతం పలికారు. పుదుచ్చేరి విమానాశ్రయంలో రన్ వే పొడవును పెంచే విషయంలో తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైన భూమిని సేకరించేందుకు చొరవ తీసుకుంటానని ఆమె తెలిపారు.