వివేకా హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేయాలి

మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని కోరుతూ  సీబీఐ చీఫ్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ వ్రాసారు.  మాజీమంత్రి పరిటాల రవీంద్ర కేసులో మాదిరిగానే నిందితులను అంతమొందించే కుట్ర చేస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జైల్లో, జైలు బయట ఉన్న నిందితులు, సాక్షులకు రక్షణ కల్పించాలని కోరారు. 
 
ఎంపీ విజయసాయిరెడ్డిని విచారించాలని రఘురామ లేఖలో కోరారు. వివేకా హత్య కేసులో పెద్దల పాత్ర వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి మద్దతు తమకు ఉన్నదని సహ నిందితులు చెప్పినట్టు వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టం చేశారు. 
 
ఆర్థిక లావాదేవీల్లో భాగంగా జరిగిన ఈ హత్యలో రూ.40కోట్ల మేరకు సుపారీ చేతులు మారినట్లు, పథకం ప్రకారం అంతమొందించినట్లు బయట పడింది. అత్యంత సంచలన రీతిలో 2019 మార్చి 15వ తేదీ పులివెందులలోని తన నివాసంలో వివేకానందరెడ్డి దారుణహత్యకు గురయ్యారు.
 
 ఆర్థిక అరాచకానికి పరాకాష్ట
 
ఏపీ ఆర్థిక అరాచకం అంత మాయని, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినదానికి, ఖర్చు చేసిన దానికి సంబంధంలేదని పేర్కొంటూ ఆర్థిక అరాచకానికి పరాకాష్టని అని రఘురామ కృష్ణం రాజు విమర్శించారు. దీన్ని ఆర్థిక ఉన్మాదం అంటారా? ఆర్థిక తీవ్రవాదం అంటారా? ఆర్థిక అనావృష్టి అంటారా? ఏమంటారని ఆయన ప్రశ్నించారు.
 
ప్రభుత్వం చెప్పినదానికి సంబంధం లేకుండా జరుగుతోందంటే… అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అనే సందేహం కలుగుతోందని చెప్పారు. కార్పొరేషన్   ద్వారా చేసిన అప్పులను బడ్జెట్‌లో చూపెట్టలేదని పేర్కొన్నారు. సివిల్ సప్లైస్ బడ్జెట్ రూ. 4,622 కోట్లు.. అయితే ఖర్చు పెట్టింది కేవలం రూ. 104 కోట్లు మాత్రమేనని గుర్తు చేశారు.  బీసీ వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టింది ఏమి లేదని,  రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు ఎంత ఉన్నాయో చూపెట్టలేదని రఘురామ వివరించారు.