ప్రతీ ఏడాది కొత్తగా 110-120 విమానాలు

విమానయాన సంస్థలు దేశంలో ప్రతీ ఏడాది కొత్తగా 110-120 విమానాలను తీసుకురానున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సిందియా ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన వింగ్స్‌ ఇండియా 2022ను ప్రారంభిస్తూ  హెలిక్యాప్టర్లు మరింత పెద్ద పరిమాణంలో రావాల్సిన అవసరం ఉందని సూచించారు. 
 
దేశంలో ప్రతీ ఏడాది విమానయాన ప్రయాణికులు సంఖ్య పెరుగుతుందని చెబుతూ  వచ్చే ఏడాది ఇది 4.10 లక్షలుగా ఉండొచ్చని తెలిపారు. దేశంలో కొత్త ఎయిర్‌పోర్టులు, విమానాల విస్తరణకు విస్తృతావకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. 2013ా-14 నాటికి దేశంలో 400 ఎయిర్‌క్రాప్ట్‌లు మాత్రమే ఉన్నాయని.. ప్రస్తుతం వీటి సంఖ్య 710కి చేరిందని గుర్తు చేశారు. ఇకపై ప్రతీ ఏడాది కొత్తగా 110ా0-120 కొత్త విమానాలు వచ్చి చేరనున్నాయని మంత్రి అంచనా వేశారు.

కాగా, భారత్‌లో విమానయాన రంగానికి ఇంధన ధరలు, కరెన్సీ, స్వల్ప చార్జీలే ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని బోయింగ్‌ కమర్షియల్‌ ఎరోప్లేన్స్‌ రీజినల్‌ మార్కెటింగ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డావె చులె తెలిపారు. వింగ్స్‌ ఇండియా -2022లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మధ్య ఈశాన్య, ఆఫ్రికా, ఆసియన్‌, నార్త్‌ అమెరికా దేశాలతో పోల్చితే భారత్‌లో విమానయాన ఇంధన ధరలు 90 శాతం అధికంగా ఉన్నాయని చెప్పారు. 
 
వచ్చే రెండు దశాబ్దాల్లో భారత వాణిజ్య విమానయాన రంగంలో విస్తృతావకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అధిక ఇంధన ధరలు కలిగిన భారత్‌లో తమ నూతన ఎయిర్‌క్రాప్ట్‌లు బోయింగ్‌ 737 మాక్స్‌, 737-10లతో వ్యయాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు.

ఇలా ఉండగా, కొత్తగా విమానయాన సేవలు ప్రారంభించిన ఫ్లైబిగ్‌ 10 విమానాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.. ఇందుకు ‘వింగ్స్‌ ఇండియా’లో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది..