ఇంధన ధరల పెంపు సబబే… కేంద్రం స్పష్టం

దేశంలో ఇటీవలి కాలంలో అన్ని రకాల ఇంధన ధరల పెంపుదల నిర్ణయం సమర్థనీయమే అని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సమర్థించారు. లోక్‌సభలో గురువారం పెరుగుతున్న పెట్రో, గ్యాసు ధరలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. 
 
అంతర్జాతీయ మార్కెట్‌లో పరిణామాలతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని మంత్రి సమాధానమిచ్చారు. సాధ్యమైనంత తొందరలోనే ప్రజలకు అందుబాటు ధరలకు ఇంధనం దొరికేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆయన హామీ ఇచ్చారు. 
 
అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్‌ఎన్‌జి ధర 37శాతం పైగా పెరిగింది. సైనిక చర్యలు ఇప్పటికీ కొలిక్కిరాని మార్కెట్ పరిస్థితితో ఈ పరిణామం ఏర్పడిందని, దీనితోనే పెట్రోలు, డీజిల్, వంటగ్యాసు ధరలను ఇక్కడ పెంచాల్సిన అవసరం ఏర్పడిందని మంత్రి తెలిపారు.
 
గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో ద్రవరూప సహజ వాయువు ధరలు ఎగబాకాయని ఆయన  వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో ధర భారీగా పెరిగినా ఇక్కడ బంకులలో ధరలు కేవలం 5 శాతం అనివార్యంగా ప్రస్తుతానికి పెంచాల్సి వచ్చిందని తెలిపారు. 
 
ఇక వంటగ్యాసుకు సంబంధించి ధరలు పూర్తిగా సౌదీ కాంటాక్టు ధరలపై ఆధారపడి ఉంటాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. రెండేళ్ల కాలంలో ఈ ధర 285 శాతం ఎగబాకింది. దీనికి అనుగుణంగానే ఇక్కడ గత ఆరు నెలల్లో 37 శాతం వరకూ పెంచాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

గత నాలుగు రోజుల్లో మూడు సార్లు పెట్రో ధరలు పెరిగాయి. తాజాగా, లీటరు పెట్రోల్, డీజిల్ పై 80 పైసల చొప్పున దేశీయ చమురు కంపెనీలు పెంచాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు చొప్పున ధర పెరిగింది. దీంతో.. లీటరు పెట్రోలు ధర 110 రూపాయల 91 పైసలు, డీజిల్ రేటు 97 రూపాయల 23 పైసలకు చేరింది.

దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్  97 రూపాయల 81 పైసులు, డీజిల్ ధర 89 రూపాయల 7 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్ 112 రూపాయల 51 పైసలు, డీజిల్ 96 రూపాయల 70 పైసలకు పెరిగింది. చెన్నైలో పెట్రోల్ 103 రూపాయల 67 పైసలు,  డీజిల్ 93 రూపాయల 71 పైసలుగా ఉంది. కోల్ కతాలో పెట్రోల్ 106 రూపాయల 34 పైసలు, డీజిల్ 91 రూపాయల 42 పైసలకు పెరిగింది.