ఆధార్ లో చిరునామా మారిస్తే చాలు…

ఆధార్‌లో చిరునామాను మారిస్తే అన్ని పత్రాల్లోనూ ఆటోమేటిక్‌గా మారిపోయే వెసులుబాటును కేంద్రం అందుబాటులోకి తీసుకువస్తోంది. మారిన చిరునామాను ఆధార్‌లో అప్‌డేట్‌ చేస్తే సరిపోతుంది. 
 
దీంతో పాన్‌కార్డు, ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, బీమా పత్రాలు, ధ్రువీకరణ పత్రాలు వంటి అన్ని పత్రాల్లోనూ చిరునామా దానంతట అదే మారేలా డిజిలాకర్‌ను సులభతరం చేసేందుకు యుఐడిఎఐ యత్నిస్తోంది. ఆయా ప్రభుత్వ విభాగాల సహకారంతో దీన్ని సాకారం చేయనుంది. 
 
ఆధార్‌ కార్డులో చిరునామా మారితే డిజిలాకర్‌లో స్టోర్‌ అయిన డ్రైవింగ్‌ లైసెన్స్‌లోనూ చిరునామా మారేలా ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖతో చర్చలు ఆరంభించింది. ఆదాయ పన్ను శాఖ సహకారంతో పాన్‌ కార్డులోనూ ఇలాంటి మార్పులకు వీలు కల్పించటంపై దృష్టి సారించింది.
 
 ప్రస్తుతం ఆధార్‌కార్డులో చిరునామా మారితే మిగతా పత్రాల్లో వివరాలను విడివిడిగా అప్‌డేట్‌ చేసుకోవాల్సి వస్తోంది. ఉదాహరణకు- డ్రైవింగ్‌ లైసెన్స్‌లో చిరునామాను మార్చుకోవాలంటే కేంద్రీకఅత పోర్టల్‌లో విడిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తును నింపి, రవాణా శాఖ కార్యాలయ అధికారులకు సమర్పించాల్సి వుంటుంది. 
 
అయితే ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తే ఇటువంటి ఇబ్బందులు వుండవని యుఐడిఎఐ వెల్లడిస్తోంది. దీంతో అన్ని పత్రాల్లోనూ మార్చేందుకు వేర్వేరు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది.