యాసంగిలోనూ తెలంగాణ బియ్యం కొంటాం… కేంద్రం స్పష్టం

యాసంగిలో కూడా కేంద్రమే బియ్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఈ నెల 25 నుండి `రైతు పోరు’ ఉద్యమం చేబడుతున్నట్లు ఒక వంక ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు  ప్రకటించగా, మరోవంక యాసంగిలో కూడా తెలంగాణ నుండి బియ్యం కొనుగోలు చేస్తామని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. 
 
రైతులను ఆదుకోవడం తమ కనీస బాధ్యత అని చెబుతూ దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి సహకరించడం లేదని, ప్రజలను తప్పదోవ పట్టించేలా వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి విచారం వ్యక్తం చేశారు.
 
సోమవారం పార్లమెంటు భవనంలో తెలంగాణ నుండి బిజెపి ఎంపీలు  బండి సంజయ్‌, సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్‌ కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చేయబోతున్నదని, ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటన చేశారని కేంద్ర మంత్రికి ఎంపీలు చెప్పారు. 
 
‘‘అసలు ముడిబియ్యాన్ని కొనబోమని చెప్పిందెవరు? దేశవ్యాప్తంగా బియ్యం సేకరణ చేస్తుంటే కేవలం తెలంగాణలోనే ఎందుకు ఆపుతాం? పక్కాగా రా రైస్‌ కొంటాం. రైతులకు ఇబ్బంది కలగకుండా చూడడం మా కనీస బాధ్యత. అసలు గతంలో ఇస్తానన్న బియ్యం ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనే లేదు” అంటూ గోయల్ విస్మయం వ్యక్తం చేశారు. 
 
  అయినా దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తోంది? అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. పార్లమెంటు సాక్షిగా గతంలోనే టీఆర్‌ఎస్‌ లేవనెత్తిన అంశాలన్నింటికీ సమాధానమిచ్చనని చెబుతూ ఇకపై భవిష్యత్తులో బాయిల్డ్‌ రైస్‌ పంపబోమని రాష్ట్ర ప్రభుత్వమే సంతకం చేసింది కదా? మళ్లీ వచ్చిన ఇబ్బంది ఏమిటి? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని సంజయ్ మండిపడ్డారు. కేంద్రం ముడి బియ్యాన్ని కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్‌ ప్రభుత్వం బీజేపీని బద్నాం చేయడమే పనిగా పెట్టుకుందని ఆయన విమర్శించారు. 
 
అకాల వర్షాల కారణంగా గత ఏడాది పంట నష్టపోయిన పసుపు రైతులకు పరిహారం అందించే అంశంపై పీయూష్‌ గోయల్‌తో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనను అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు.
 
 రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల కేంద్ర మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే.. పరిహారంపై పరిశీలిస్తామని హామీ ఇచ్చారని అర్వింద్‌ వెల్లడించారు.