సీఎంగా పుష్కర్ ధామీకి మరో అవకాశం 

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ మరోసారి  ప్రమాణం చేయనున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన ఆయన మాత్రం ఓటమిపాలయ్యారు. దీంతో సీఎం ఎవరవుతారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. 
 
కేంద్ర పరిశీలకులుగా వచ్చిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉత్తరాఖండ్ బీజేపీ నేతలతో, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో చర్చించారు. ఇవాళ సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు ధామీని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. 
 
 సీఎం రేసులో పుష్కర్ సింగ్తో పాటు సత్పాల్ మహరాజ్, మాజీ కేంద్ర మంత్రి రమేష్ పోక్రియాల్ నిశాంక్, ఎమ్మెల్యే అనిల్ బలూనీ ఉన్నప్పటికీ చివరకు ధామీకే అవకాశం దక్కింది. ఉత్తరాఖండ్ సీఎంగా పనిచేసిన కొంతకాలంలోనే ధామీ పాలనలో తన మార్కు చూపించారని, అందుకే మరోసారి అవకాశమిస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. 
 
ఖతిమా నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ధామీ ఓటమిపాలయ్యారు. ధామీ సీఎం అయ్యాక ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ బీజేపీ 47 చోట్ల గెలిచి తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది.
 

మణిపూర్ లో బీరేన్ సింగ్ ప్రమాణస్వీకారం

 
మణిపూర్ ముఖ్యమంత్రిగా ఎన్.బీరే‌న్ సింగ్ సోమవారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సీఎంగా పగ్గాలు చేపట్టడం వరుసగా ఇది రెండోసారి. ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో బీరేన్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ ఎల్.గణేషన్ ప్రమాణం చేయించారు. 
 
ఐదుగురు ఎమ్మెల్యేలను కూడా బీరేన్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు బీజేపీకి చెందిన వారు, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌‌పీఎఫ్)కు చెందిన ఒకరు ఉన్నారు. వీరి చేత కూడా గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. 
 
బీజేపీ నుంచి టీహెచ్ బిశ్వజిత్, యుమ్నమ్ ఖేమ్‌చంద్, గోవిందాస్ కొతౌజమ్, మెమ్చా కెప్‍‌జిన్, ఎన్‌పీఎఫ్ నుంచి అవాంగ్‌బౌ న్యుమాయ్‌ ప్రమాణ్వీకారం చేసిన వారిలో ఉన్నారు.