బొగ్గు కుంభకోణం కేసులో మమత మేనల్లుడికి తాజా సమన్లు

పశ్చిమ బెంగాల్‌లో బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపి అభిషేక్ బెనర్జీకి, ఆయన భార్యకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం తాజాగా సమన్లు జారీచేసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు.
 
 అభిషేక్, ఆయన భార్య రుజిర బెనర్జీ వచ్చే వారం దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని ఇడి ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఇడి ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ తమకు జారీచేసిన సమన్లను అభిషేక్ దంపతులు ఢిల్లీ హైకోర్టులో సవాలు చేయగా మార్చి 11న పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 
 
పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్, దాని చుట్టు పక్కల ప్రాంతాలో ఉన్న కునుస్టోరియా, కజోరా బొగ్గు గనులలో కోట్లాది రూపాయల బొగ్గు చోరీ కుంభకోణం జరిగినట్లు సిబిఐ 2020 నవంబర్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. 
 
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా స్థానిక బొగ్గు వ్యాపారి అనూప్ మఝి అలియాస్ లాలాను సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఈ అక్రమ వ్యాపారం నుంచి అభిషేక్ బెనర్జీ లభ్ధి పొందారని ఆరోపిస్తూ కేసు నమోదు చేసింది.