ఒమిక్రాన్ కట్టడిలో భారత్‌లో మెరుగైన వ్యూహాలు

కరోనా కట్టడిలో ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని నిరోధించడంలో ఇతర దేశాల కన్నా భారత్ మెరుగైన వ్యూహాలను అనుసరించిందని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. “ఇండియాస్ పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్ టు మేనేజ్ కరోనా” అనే శీర్షికతో ఏర్పాటైన వెబినార్‌ను నీతి ఆయోగ్, 200 కన్నా ఎక్కువ ఎన్‌జివొలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లు నిర్వహించాయి. 

ఈ సందర్భంగా మాండవీయ ప్రధాన ప్రసంగం చేస్తూ బలమైన రాజకీయ సంకల్ప శక్తితో, స్వావలంబన,సాంకేతిక ఆధార ఆవిష్కరణ, సమన్వయ ప్రయత్నాలు వీటన్నిటితో కొవిడ్ నిర్వహణ ఎలా చేయడమైందో మనం ప్రపంచానికి చాటడమైందని చెప్పారు.

చాలా దేశాల్లో రోజువారీ కేసులు పెరుగుతున్న సమయంలో భారత్‌లో క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టడం, అలాగే రికవరీలు పెరగడం, ముమ్మరంగా అత్యధిక స్థాయిలో వ్యాక్సినేషన్ కొనసాగడం తదితర ప్రయత్నాలను మాండవీయ ఈ సందర్భంగా  ప్రస్తావించారు. 

పరీక్షలు, కేసులను గాలించడం, చికిత్సలు, జీనోమ్ సీక్వెన్సింగ్, వ్యాప్తిని అరికట్టడం, సామాజిక పర్యవేక్షణ, ఇంటివద్దనే ఐసొలేషన్, సమర్థమైన వైద్య చికిత్స ఇవన్నీ భారత్ కరోనాను సమర్థంగా నిర్వహించడానికి తోడ్పడ్డాయని వివరించారు. హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ మార్క్ ఎస్పోసిటో , బిల్ అండ్ మెళిందా గేట్స్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ క్రిస్ ఎలియాస్ కరోనా కట్టడిలో భారత్ ప్రశంసనీయమైన పాత్ర వహించిందని కొనియాడారు. 

ప్రపంచ వ్యాప్తంగా మళ్ళి విజృంభిస్తున్న కరోనా 
 
ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా ఆసియాలోని వివిధ ప్రాంతాల్లో మహమ్మారి మళ్లీ ఊపిరిపోసుకుంటుంది. కొన్ని వారాల పాటు మహమ్మారి తగ్గినట్లు కనిపించినప్పటికీ.. కరోనా ముగిసిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనామ్‌ గాబ్రియేసస్‌ హెచ్చరించారు. 
 
ప్రతి దేశం వేర్వేరు సవాళ్లతో విభిన్న పరిస్థితిని ఎదుర్కొంటున్నందున.. మహమ్మారి ముగియలేదని గ్రహించాలని పేర్కొన్నారు. ‘ కొన్ని దేశాల్లో పరీక్షలు తగ్గినప్పటికీ.. కేసులు పెరుగుతున్నాయి. అంటే మనం చూస్తున్న కేసులు మంచుకొండ కొన మాత్రమే’ అని తెలిపారు.

దక్షిణ కొరియాలో గురువారం ఒక్క రోజులో 6.2 లక్షల కేసులు నమోదయ్యాయి. అమెరికా కన్నా రికార్డు స్థాయిలో తాజా కేసులు వెలుగుచూశాయి. అక్కడ కేవలం వారం రోజుల్లో 24 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇక జర్మనీలో వారం రోజులో 15 లక్షలు, వియత్నాం 12 లక్షలు, ఫ్రాన్స్‌ 5.2 లక్షలు, యుకెలో 4.8 లక్షల కేసులు నమోదయ్యాయి. 

 
చైనా కూడా మునుపెన్నటి లేని విధంగా కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. డబ్ల్యుహెచ్‌ఒ ప్రకారం  రోజుల్లో కొత్తగా నమోదైన కేసులో దక్షిణ కొరియా ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉంది. ఇన్ని కేసులు నమోదవుతున్నా కరోనాను కట్టడి చేసేందుకు విధించిన ఆంక్షలను సడలించాలని దేశం నిర్ణయించింది.