ప్రముఖ జర్నలిస్ట్ విద్యారణ్య మృతి

ప్రముఖ జర్నలిస్ట్ విద్యారణ్య మృతి

జర్నలిజం వృత్తిలో దశాబ్దాలు పాటు పని చేసి కడవరకు తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిగా పేరుగాంచిన విద్యారణ్య కామ్లేకర్ ఇక లేరు. 62 ఏళ్ల వయసులో గుండెపోటుతో బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. జర్నలిజం ఒక వృత్తి కాదు.. బాధ్యతగా భావించే అరుదైన వ్యక్తులలో ఆయన ఒకరు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

హిందుస్థాన్ సమాచార్, ఆంధ్ర పత్రిక, హిందీ మిలాప్, ఆంధ్ర ప్రభ లలో పనిచేసి, ప్రస్తుతం మరాఠి పత్రిక సకాల్ కు రెండు తెలుగు రాష్ట్రాల ప్రత్యేక ప్రతినిధిగా పనిచేస్తున్నారు. మంచి సాహిత్యాభిలాషి, రచయిత, స్నేహితుడు. సామజిక, రాజకీయ, సాహిత్య రంగాలపట్ల మంచి అవగాన గల వ్యక్తి. వరంగల్, నల్గొండ, హైదరాబాద్ లలో పనిచేశారు.

1960 మే 17న కర్నూల్ లో జన్మించిన ఆయన తండ్రి హీరాలాల్ మంచి సాహితీవేత్త. తండ్రిగారి పాండిత్యాన్ని వారసత్వంగా అందుకున్నారు. మంచి పుస్తక ప్రియుడు. మంచి పుస్తకాలు చదువుతూ, తన అభిప్రాయాలను పేస్ బుక్ లో పంచుకొంటుంటారు. ఆంధ్ర పత్రికలో సహచర పాత్రికేయ ప్రముఖులతో అనుభవాలను సహితం ప్రస్తావిస్తుండేవారు.

విద్యారణ్య మరణంపట్ల ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ లతో సహా పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. బాల్యం నుండి స్వయంసేవక్. సంఘ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటుండేవారు. సమాచార భారతిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండేవారు.