ప్రధానిని  ప్రమాణ స్వీకారంకు ఆహ్వానించిన యోగి 

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీనికలిసి  తన పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి తప్పకుండా రావాలని ఆహ్వానించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మూడు రోజుల తర్వాత యోగి న్యూఢిల్లీలో ప్రధాని మోదీని కలవడం విశేషం.
 
యూపీ ఎన్నికల్లో విజయం సాధించిన యోగికి ఈ సందర్భంగా ప్రధాని మోదీ కూడా అభినందనలు తెలిపారు.  ఆ తర్వాత మోదీ  తన ట్వీట్‌లో ‘ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేడు నాతో సమావేశం అయ్యారు. యూపి ఎన్నికల్లో చారిత్రక విజయంపై ఆయనకు అభినందనలు తెలిపాను. ఆయన గత ఐదేళ్లలో తన ఆకాంక్షలను పూర్తి చేయడానికి అహర్నిషలు పరిశ్రమించారు. రాబోయే సంవత్సరాలలో కూడా ఆయన రాష్ట్రాన్ని మరింత పైకి తీసుకెళతారని నాకు నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ను కూడా యోగి కలిసి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

కొత్త మంత్రుల ఎంపిక, ఎన్నికల హామీల అమలు తదితర అంశాలపై కేంద్ర నాయకత్వంతో యోగి చర్చించిన్నట్లు తెలుస్తున్నది. కేబినెట్ బ్లూ ప్రింట్కు తుదిరూపం ఇవ్వడంతో పాటు ప్రమాణ స్వీకార తేదీని కూడా చర్చించినట్లు చెబుతున్నారు. హోలీ అనంతరం ఉత్తర్ ప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రిగా  యోగితో పాటు ఒకే రోజున పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. కుల సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ కేబినెట్ కు రూపం ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా, యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు ముఖ్యమంత్రిగా తన రాజీనామాను సమర్పించారు. ఉత్తరప్రదేశ్‌లో పూర్తి పదవీకాలం పూర్తయిన తర్వాత గత 37 ఏళ్లలో తిరిగి అధికారంలోకి వచ్చిన మొదటి ముఖ్యమంత్రి ఆయనే.
ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేయాల్సిన చర్యల జాబితాను ఇప్పటికే రూపొందించింది. యోగి క్యాబినెట్ 2.0 సమావేశంలో సంకల్ప్ పత్ర లేదా అధికారిక మేనిఫెస్టోలో చేర్చబడిన వాగ్దానాలను అమలు చేయడానికి అంతర్గత సన్నాహాలు ప్రారంభించారు.