ఏఎంజీ ఇండియా ఎఫ్ సి ఆర్ ఎ రద్దుకు సిఫారసు

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని క్రైస్తవ స్వచ్ఛంద సంస్థ ఏ.ఎం.జీ ఇండియా ఇంటర్నేషనల్ పై జాతీయ బాలల హక్కుల కమిషన్ కన్నెర్ర చేసింది. చిన్నపిల్లలను క్రైస్తవంలోకి మతమార్పిడి చేస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సంస్థకు చెందిన విదేశీ విరాళాల లైసెన్స్ రద్దు చేయాల్సిందిగా జాతీయ బాలల హక్కుల కమిషన్ కేంద్ర హోంశాఖకు సిఫారసు చేసింది. ఈ మేరకు బాలల హక్కుల కమిషన్ చైర్మన్ ప్రియాంక్ కానుంగొ కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఫారినర్స్ డివిజన్ జాయింట్ సెక్రెటరీలకు లేఖ రాశారు.

ఏఎంజీ కార్యకలాపాలు, విదేశీ విరాళాల దుర్వినియోగం, మైనర్ బాలబాలికల మతమార్పిడి అంశాలపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ సమర్పించిన నివేదికపై స్పందించిన జాతీయ బాలల హక్కుల కమిషన్, కేంద్ర హోంశాఖకు ఈ సిఫారసు చేసినట్టు తెలిసింది.

ఏఎంజీగా వ్యవహరింపబడుతున్న ‘Advancing the Ministries of Gospel’ సంస్థ బాలల సంరక్షణ, విద్య పేరిట సేకరించిన యొక్క విదేశీ విరాళాలను  దుర్వినియోగం చేసినట్టు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ బాలల హక్కుల కమిషన్ కు తమ నివేదికలో తెలిపింది. 2006-07 ఆర్ధిక సంవత్సరం నుండి 2020-21 ఆర్ధిక సంవత్సరం నాటికి ఎంఎంజీ రూపాయలు 789,45,18,058 కోట్ల విదేశీ ధనం విరాళాలుగా స్వీకరించి, మతమార్పిడికి వినియోగించినట్టు తెలిపింది.

అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన ఫారిన్ కంట్రిబ్యూషన్ రిటర్న్ పత్రాలలో కూడా అవకతవకలు ఉన్నాయని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కమిషన్ కు తెలిపింది. దీంతో ప్రజాప్రయోజనం రీత్యా, దేశ సార్వభౌమత్వం, సమగ్రత మొదలైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఏఎంజీ ఇండియా ఇంటెర్నేషనల్ విదేశీ విరాళాలను వెంటనే నిలిపివేయాల్సిందిగా కమిషన్ హోంశాఖను కోరింది.