బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు కారణాలడిగిన హైకోర్టు

బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావులను సస్పెండ్‌ చేయడానికి కారణాలేంటో తెలపాలని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ను హైకోర్టు ఆదేశించింది. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన ఈ నెల 7న సభలో ఏం జరిగిందో చెప్పాలంది. 
 
సమావేశాల ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి పిటిషనర్‌ సమర్పించిన వీడియో సరైనది కాదన్నప్పుడు సభలో రికార్డు చేసిన ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించిన వీడియోను సమర్పించడానికి అభ్యంతరమేంటని ప్రశ్నించింది. శాసనసభ కార్యదర్శి, శాసనసభ సెక్రటేరియట్‌ కార్యదర్శిలకు నోటీసులు జారీ చేస్తున్నామని, సస్పెన్షన్‌కు కారణాలు తెలియజేయాలని స్పష్టం చేసింది. 
 
తమను చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా సస్పెండ్‌ చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ డాక్టర్‌ షమీమ్‌ అక్తర్‌ బుధవారం విచారించారు.  
 
సరైన కారణాలు లేకుండానే బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారం సభ వ్యవ హారాలను అడ్డుకున్న సభ్యు డి పేరును స్పీకర్‌ ప్రస్తావించాలని, వారిని సస్పెండ్‌ చేయాలని కోరుతూ శాసనసభ వ్యవహారాల మంత్రి తీర్మానాన్ని ప్రతిపాదించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 
 
స్పీకర్‌ ఎవరి పేరును ప్రస్తావించకుండానే ముందు రాసుకొచ్చిన మేరకు బీజేపీకి చెందిన ముగ్గురు సభ్యులను సస్పెండ్‌ చేయాలని మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ తీర్మానం ప్రతిపాదించారని తెలిపారు. గవర్నర్‌ను ఆహ్వానించకపోవడంపై బీజేపీ సభ్యులు నిరసన తెలిపారని.. రాజేందర్, రఘునందన్‌రావులు తమ స్థానాల్లో ఉండి నిరసన తెలిపారని, రాజాసింగ్‌ స్పీకర్‌ స్థానం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారని వివరించారు.
 
 స్పీకర్‌ స్థానం వైపు వెళ్లినంత మాత్రాన సస్పెం డ్‌ చేయడానికి వీల్లేదని.. రాజ్యాంగ, చట్ట నిబంధనలకు విరుద్ధంగా వారిని సస్పెండ్‌ చేశారని పేర్కొన్నారు. సస్పెండ్‌ ఉత్తర్వులను పిటిషన్‌తో పాటు ఎందుకు సమర్పించలేదని ప్రకాశ్‌రెడ్డిని ప్రశ్నిం చగా.. తాము కోరినా శాసనసభ కార్యదర్శి ఇవ్వడం లేదని తెలిపారు.
వీరిని సస్పెండ్‌ చేసినట్లు అన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిందని, ఓ చానల్‌లో వచ్చిన వీడియోను సమర్పించామని తెలిపారు. సస్పెండ్‌ చేస్తూ జారీచేసిన ఉత్తర్వులతో పాటు 7న సభా వ్యవహారాలకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారం వీడియోను సమర్పించేలా ఆదేశించాలని కోరారు.
ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. సభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని నివేదించారు. సమావేశాలకు సంబంధించి పిటిషనర్‌ సమర్పించిన వీడియో సరైనది కాదని పేర్కొన్నారు. విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేశారు.