పాక్ గోధుమలు నాసిరకం … భారత్ గోధుమలు మేలిమి!

ఈ మాటలు అంటున్నది ఎవ్వరో భారతీయులు కారు. భారత దేశంతో చెప్పుకోదగిన సంబంధాలు లేని, ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైన మద్దతు పాకిస్థాన్ నుండి తీసుకున్న తాలిబన్లు. ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న ఆ దేశానికి మానవతా సహాయం క్రింద రెండు పొరుగు దేశాలు గోధుమలు పంపించాయి. అయితే పాకిస్థాన్ పంపిన గోధుమలు ఎందుకు పనికిరాకుండా ఉండడం, భారత్ పంపిన గోధుమలు నాణ్యమైనవి కావడంతో పాకిస్థాన్ ప్రభుత్వంపై తాలిబన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. 

‘‘పాక్‌ నుంచి పంపించిన గోధుమ నాసికరంగా ఉన్నాయి. తినడానికి అస్సలు పనికిరావు. చెత్తలో పారబోయడానికి తప్ప  ఎందుకు పంపారో ఆ దేశ ప్రభుత్వానికే తెలియాలి.  బహుశా ఖరాబును జమ చేసుకోవడం ఇష్టం లేక పంపారేమో’’ అంటూ అక్కడి అధికారులు మండిపడ్డారు. 

అదే సమయంలో భారత్‌ అందించిన గోధుమల పైనా స్పందించారు. `భారత్‌ మేలిమి రకపు గోధుమలను అందించిందని, అందుకు మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు’ అని తెలిపారు. తాలిబన్‌ ప్రతినిధులు పాక్‌-భారత్‌ గోధుమ సాయంపై స్పందించిన వీడియో ఒక దానిని అఫ్గన్‌ జర్నలిస్ట్‌ అబ్దుల్లా ఒమెరీ ట్వీట్‌ చేశారు.

 దీనికి అఫ్గన్‌ నెటిజనుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. జై హింద్‌ అంటూ పలువురు అఫ్గన్‌ పౌరులు ట్వీట్లు చేస్తుండడం విశేషం. సంక్షోభ సమయం నుంచే భారత్‌, అఫ్గనిస్థాన్‌కు సాయం అందిస్తోంది.ఈ క్రమంలో రోడ్డు మార్గం గుండా సరుకులు పంపే సమయంలో పాక్‌ భారత్ కు అభ్యంతరాలు వ్యక్తం చేసి అడ్డుపడగా, తమ దేశం గుండా అనుమతించి పెద్ద మనసు చాటుకుంది ఇరాన్‌.

ఇదిలా ఉండగా.. అమృత్‌సర్‌ నుంచి గత  గురువారం 2వేల మెట్రిక్‌ టన్నుల గోధుమలను పంపినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమంలో భాగంగా యాభై వేల మెట్రిక్‌ టన్నుల గోధుమలను పంపాలనే కమిట్‌మెంట్‌కు కట్టుబడి.. సాయం అందిస్తూ పోతోంది భారత్‌. ఈ సందర్భంగా కోలుకుంటున్న అఫ్గన్‌తో భారత్‌ మంచి సంబంధాలు కోరుకుంటోందని విదేశాంగ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి ట్వీట్‌ చేశారు.