ఫిబ్రవరిలో భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు

జీఎస్టీ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. గత నెలలో  వీటి రెవెన్యూలు 2021 ఏడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే 18 శాతం పెరిగి రూ.1.33 లక్షల కోట్లకు చేరాయి. ఫిబ్రవరి 2022 నెలలో ఖజానాకు వచ్చిన స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,33,026 కోట్లు. ఇందులో సీజీఎస్టీ రూ.24,435 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.30,779 కోట్లు, ఐజీఎస్టీ రూ.67,471 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ.33,837 కోట్లతో కలిపి) ఉంది. 
 
ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. వీటిలో సెస్ విలువ రూ.10,340 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.638 కోట్లతో సహా). 2022 ఫిబ్రవరి నెల ఆదాయాలు గత ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన జీఎస్టీ ఆదాయాల కంటే 18శాతం ఎక్కువ.  2020 ఫిబ్రవలో వచ్చిన జీఎస్టీ రాబడి కంటే 26శాతం ఎక్కువ. వస్తువుల దిగుమతుల ఆదాయం 38 శాతం పెరిగింది.  
 
దేశీయ లావాదేవీల (సేవల దిగుమతులతో సహా) ద్వారా వచ్చే ఆదాయాలు గత సంవత్సరం ఇదే నెలలో వచ్చిన ఆదాయాల కంటే 12శాతం ఎక్కువగా ఉన్నాయి. జీఎస్టీ వసూళ్లు రూ.1.30 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది ఐదోసారి. ఈ పన్ను విధానం అమలులోకి వచ్చినప్పటి నుండి, మొదటిసారిగా సెస్ కూడా రూ.10,000 కోట్ల మార్క్‌‌ను దాటింది. 
 
ఇది కొన్ని కీలక రంగాల రికవరీని సూచిస్తుందని, ముఖ్యంగా ఆటోమొబైల్ అమ్మకాలు పెరిగాయని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఫిబ్రవరిలో, ప్రభుత్వం ఐజీఎస్టీ నుండి సీజీఎస్టీకి రూ.26,347 కోట్లు,  ఎస్జీఎస్టీకి రూ.21,909 కోట్లు చెల్లించింది. రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత ఫిబ్రవరి 2022 నెలలో కేంద్రం,  రాష్ట్రాల మొత్తం ఆదాయం వరుసగా సీజీఎస్టీ  రూ.50,782 కోట్లు,  ఎస్జీఎస్టీ  రూ.52,688 కోట్లు.