ఉక్రెయిన్‌ కాల్పుల్లో భారతీయ విద్యార్థి మృతి

ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడుల్లో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. పశ్చిమ ఉక్రెయిన్‌కు చెందిన ఖార్కివ్ నగరంపై మంగళవారం ఉదయం రష్యా ప్రయోగించిన బాంబు దాడుల్లో శేఖరప్ప నవీన్ (21) అనే భారతీయ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 
 
కర్ణాటకకు చెందిన నవీన్ ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, ఈ విషయంపై సానుభూతి తెలుపుతున్నామని బాగ్చి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 
ఉక్రెయిన్‌లో నవీన్ శేఖరప్ప దురదృష్టకర మరణాన్ని అధికారికంగా కర్నాటక కమిషనర్ మనోజ్ రాజన్ ధృవీకరించారు. నవీన్‌ది  హవేరి జిల్లాలోని చలగేరి గ్రామమని తెలిపారు. ఏదో కొనడానికి సమీపంలోని దుకాణానికి బయలు దేరగానే, అక్కడ బాంబు దాడి జరిగింని పేర్కొన్నారు. నవీన్ చనిపోయాడని అతని స్నేహితుడికి స్థానిక అధికారి నుండి కాల్ వచ్చిందని మనోజ్ రాజన్ తెలిపారు. 
 శేఖరప్ప నవీన్ కుటుంబాన్ని ప్రధాని మోదీ పరామర్శించారు. నవీన్ తండ్రితో ఫోన్‌లో మాట్లాడిన మోదీ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి బవసరాజు బొమ్మై కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నవీన్ కుటుంబం తనకు చాలాకాలం నుంచి తెలుసని, విద్యార్థి మృతదేహాన్ని ఇండియాకు తెచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
ఇదే ఘటనలో కర్ణాటకకు చెందిన మరో ఇద్దరు గాయపడ్డారని బొమ్మై చెప్పారు. విద్యార్థి మృతదేహంతోపాటు బాధితులను భారత్ తీసుకొచ్చే విషయంలో సహకరించాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయానికి, విదేశీ వ్యవహారాల శాఖను బొమ్మై కోరారు. 
 
 కాగా, ఈ ఘటనపై ఢిల్లీలో ఉన్న ఉక్రెయిన్, రష్యా రాయబారులను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి పిలిపించుకుని మాట్లాడనున్నట్లు బాగ్చి పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ప్రతి ఒక్క భారతీయుడినీ అత్యంత వేగంగా ఇండియాకు భారత్ కు  చేర్చాలన్న డిమాండ్‌ను ఆ రెండు దేశాల రాయబారుల ముందు ఉంచనున్నట్లు తెలిపారు. రష్యా, ఉక్రెయిన్‌లలో ఉన్న భారత రాయబారులు కూడా ఈ విషయంపై అక్కడి విదేశాంగ శాఖను డిమాండ్ చేస్తారని అన్నారు.
 
మరోవైపు  ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తీవ్రతరమవుతున్న తరుణంలో కీవ్‌‌ను తక్షణమే వదిలిపెట్టాలని భారతీయులను ఆ నగరంలోని ఇండియన్ ఎంబసీ మంగళవారం కోరింది.
 
 ఉపగ్రహ ఛాయా చిత్రాలనుబట్టి 64 కిలోమీటర్ల మేరకు రష్యా సైన్యాలు ఉక్రెయిన్‌ వైపు కదులుతున్నట్లు వెల్లడైన నేపథ్యంలో ఈ అడ్వయిజరీని ఇండియన్ ఎంబసీ ఇచ్చింది.  బాంబు దాడులతో వణికిపోతున్న ఖార్కివ్ నగరంలో ఇంకా భారీ సంఖ్యలోనే భారతీయ విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.
ఇటీవలి వరకు ఇండియన్ ఎంబసీ జారీ చేసిన అడ్వయిజరీలలో ‘‘ప్రశాంతంగా, సురక్షితంగా ఉండండి’’ అని కోరుతూ ఉండేది. మంగళవారం జారీ చేసిన అడ్వయిజరీలో ‘‘విద్యార్థులు సహా భారతీయులంతా నేడు అత్యవసరంగా కీవ్ నగరాన్ని విడిచిపెట్టండి. ముఖ్యంగా అందుబాటులో ఉన్న రైళ్లు లేదా ఏదైనా ఇతర రవాణా సాధానాల ద్వారా కీవ్ నగరాన్ని వదిలి వెళ్ళండి’’ అని తెలిపింది.
‘ఆపరేషన్ గంగ’ పేరుతో ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను విమానాల ద్వారా రప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కృషిలో భారత వాయు సేన కూడా పాలుపంచుకోవాలని మోదీ పిలుపునిచ్చినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ మంగళవారం తెలిపింది. వాయు సేన రంగంలోకి దిగితే తక్కువ సమయంలో ఎక్కువ మందిని తీసుకురావడానికి వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోందని తెలిపింది. మరోవైపు మానవతావాద సాయాన్ని మరింత సమర్థవంతంగా అందజేయడానికి కూడా వీలవుతుందని భావిస్తున్నట్లు పేర్కొంది.
 ‘ఆపరేషన్ గంగ’ కోసం మంగళవారం నుంచే సీ-17 విమానాలను వాయు సేన నడిపే అవకాశం ఉందని తెలిపింది.  ఇదిలావుండగా, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు స్పైస్‌జెట్ ఓ ప్రత్యేక విమానాన్ని స్లొవేకియాకు మంగళవారం నడుపుతుంది. ఈ తరలింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్లొవేకియాకు వెళ్తారు.
ఉక్రెయిన్‌లో భీకర యుద్ధం జరుగుతుండడంతో అక్కడ చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం వేగంగా స్వదేశానికి తీసుకొస్తోంది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో కమర్షియల్ ఫ్లైట్స్‌కు ఎయిర్ స్పేస్‌ను మూసేయడంతో ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులను సరిహద్దు దేశాలైన హంగేరి, రొమేనియాలకు తరలించి స్పెషల్ ఫ్లైట్స్‌తో తీసుకొస్తోంది.
 
ఇప్పటికే ఏడు ఫ్లైట్లలో 1,578 మంది భారతీయులను ఇండియాకు తీసుకురాగా.. ఇవాళ మధ్యాహ్నం మరో రెండు ఫ్లైట్స్ ఢిల్లీ చేరుకున్నాయి. హంగేరిలోని బుడాపెస్ట్, రొమేనియాలోని బుకారెస్ట్‌ల నుంచి ఒక ఫ్లైట్‌లో 216 మందిని, మరో ఫ్లైట్‌లో 218 మందిని సేఫ్‌గా ఇండియాకు తీసుకొచ్చింది. వీరికి కేంద్ర మంత్రులు ఆర్కేసింగ్, మన్‌సుఖ్ మాండవీయ స్వాగతం పలికారు.
 
 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని సేఫ్‌గా స్వస్థలాలకు చేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ తరలింపు ఆపరేషన్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా నలుగురు కేంద్ర మంత్రులను ప్రధాని మోదీ  ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లాలని ఆదేశించారని చెప్పారు.