ఫార్మసీ కోర్స్ లో తప్పనిసరిగ్గా ఎగ్జిట్‌ పరీక్ష

ఫార్మసీ విద్యలో ప్రమాణాలు పెంచడం కోసమై మూడేళ్ల ఫార్మసీ కోర్సు చదివాక  కచ్చితంగా ఫార్మసీ ఎగ్జిట్‌ పరీక్షను రాయాలని  భారత ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కొత్త నిబంధన తీసుకువచ్చింది. ఈ టెస్టులో 50శాతం మార్కులతో ఉత్తీర్ణులైతేనే విద్యార్థులు రిజిష్టర్డ్‌ ఫార్మాసిస్టుగా చలామణి కానున్నారు. 
 
ఈ మేరకు ఫార్మసీ కౌన్సిల్‌ ఇఫ్‌ ఇండియా గెజిట్‌ను కూడా జారీ చేసింది. ప్రస్తుతం నామమాత్రం ఫార్మసీ చదువుతున్న వారి సంఖ్య తెలంగాణలో భారీ సంఖ్యలోనే ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఫార్మాసిస్టు అడ్మిషన్‌ తీసుకుని కాలేజీకి పోయి చదవకున్నా, కాలేజీ యాజమాన్యాలు మేనేజ్‌ చేసి పరీక్షలు రాసి పాసవుతున్నారు.
 
 ఆ సర్టిఫికెట్‌తో రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌లో కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్టుగా రిజిస్ట్రేషన్‌ చేసుకుని మెడికల్‌ షాపులను నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఫార్మసీ ఔషధాలపై చాలా మంది మెడికల్‌ షాపు ఓనర్లకు అవగాహన లేకుండా పోతోంది.
 
ఇతర రాష్ట్రాల్లోని ఫార్మసీ కాలేజీలను మేనేజ్‌ చేసి ఫార్మాసిస్టుల అవతారమెత్తి నిర్వహిస్తున్న మెడికల్‌ షాపులు రాష్ట్రంలో 30 శాతం దాకా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఔషధాలపై అవగాహన కొరవడిన కారణంగా విచ్చలవిడిగా యాంటీ బయోటెక్స్‌ అమ్మకాలు, పెయిన్‌ కిల్లర్స్‌ విక్రయాలు, నిద్రమాత్రల కౌంటర్‌ సేల్స్‌, ప్రిస్కిప్షన్‌ లేకున్నా కాఫ్‌ సిరఫ్‌ అమ్మకాలు రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. 
 
డాక్టర్‌ ఓ మందు రాస్తే మెడికల్‌ షాపులు ఇస్తున్న మందులు మరొకటిగా ఉంటున్నాయి. దీంతో జనం కిడ్నీ, లివర్‌ వైఫల్య సంబంధిత దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. తాజాగా ఫార్మాకౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తీసుకొచ్చిన ఎగ్జిట్‌ పరీక్షతో ఈ పరిస్థితుల్లో చాలా మేరకు మార్పులు వస్తాయని ఫార్మాసిస్టు యూనియన్లు చెబుతున్నాయి.
ఎగ్జిట్‌ పరీక్షతో ఫార్మాసీ విద్య ప్రమాణాలు పెరుగుతాయని, ప్రజలకూ నాణ్యమైన, సహేతుకమైన ఔషధాలు అందుబాటులోకి వస్తాయని తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌ సభ్యుడు డా. ఆకుల సంజయ్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, ఇదే సమయంలో రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ రాష్ట్రంలో ఫార్మసీ చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.