భారత్ – యుఎఇ మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం

భారత్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమరైట్స్‌ (యుఎఇ) మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సిఇపిఎ) కుదిరింది. సరుకులు, సేవలు, పెట్టుబడులు, వాణిజ్యానికి సంబంధించిన ఈ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య వ్యాపారాలు మరింత బలోపేతం కానున్నాయి.
 
 ప్రస్తుతం భారత వాణిజ్యంలో గల్ప్‌ మూడో అతిపెద్ద భాగస్వామ్య దేశంగా ఉంది. వర్చ్యూవల్‌గా జరిగిన ఈ మెగా ఒప్పంద కార్యక్రమంలో ప్రధానీ నరేంద్ర మోదీ, అబూదాబి రాకుమారుడు షేక్‌ మహ్మాద్‌ బిన్‌ జాయెడ్‌ అల్‌ నయన్‌ పాల్గొన్నారు. 
”ఈ ఒప్పందం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల్లో కీలక మైలురాయిగా నిలువనుంది. వచ్చే ఐదేళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం 60 బిలియన్‌ డాలర్ల నుంచి 100 బిలియన్‌ డాలర్లకు చేరనుంది” అని ప్రధానీ మోదీ  పేర్కొన్నారు. 
 
సిఇపిఎలో తొలిసారి అనేక అంశాలను చేర్చడం జరిగిందని వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ తెలిపారు. దీని ద్వారా టెక్స్‌టైల్స్‌, తోలు, పాదరక్షలు, ఫర్నీచర్‌, వ్యవసాయం, అహారోత్పత్తులు, ప్లాస్టిక్స్‌, ఇంజనీరింగ్‌ గూడ్స్‌, ఔషద ఉత్పత్తులు, ఆట వస్తువులు ప్రోత్సాహకాలు లభించనున్నాయని చెప్పారు. 
ఇరు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) ద్వారా 26 బిలియన్‌ డాలర్ల విలువ చేసే దేశీయ ఉత్పత్తులపై 5 శాతం డ్యూటీ మాత్రమే అమల్లో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 60 బిలియన్‌ డాలర్లుగా ఉంటుందని అంచనా.