ఎల్‌ఐసి వద్ద సరిపడ మూలధనం .. చైర్మన్ భరోసా

ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) వద్ద సరిపడ మూలధనం ఉందని ఆ సంస్థ ఛైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ తెలిపారు. ఐపిఒకు రానున్న ఎల్‌ఐసికి విస్తృత ఇన్వెస్టర్లు ఉన్నారని చెప్పారు. ఇందులోని 5 శాతం వాటాల విక్రయం తర్వాత ప్రభుత్వానికి 95 శాతం వాటాలు ఉండనున్నాయని పేర్కొన్నారు. 
 
తమ సంస్థకు మూలధనం అవసరం ఉండబోదని విశ్వసిస్తున్నానని తెలిపారు. ఒక వేళ ఎల్‌ఐసికి నిధులు అవసరమయితే ప్రభుత్వాన్నే కాకుండా వాటాదారులను కూడా సంప్రదిస్తామని వెల్లడించారు.  ఇతర బీమా కంపెనీలతో పోల్చితే తమ లాభదాయకపు సంస్థ భిన్నమైందని స్పష్టం చేశారు. తమ వద్ద రూ.50,000 కోట్ల పైగా మిగులు నిధులున్నాయని తెలిపారు.
 
 కానీ.. ఇందులోని 95 శాతం నిధులు కూడా పాలసీదారులకు చెందుతాయని చెప్పారు. అయితే భవిష్యత్తులో ఈ వాటా 95 శాతం నుంచి 90 శాతానికి తగ్గనుందని పేర్కొన్నారు. అదే విధంగా లాభాలు మరింత పెరగనున్నాయని కుమార్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎల్‌ఐసి వెబ్‌సైట్‌లో 60-70 లక్షల మంది ఖాతాదారులు తమ పాన్‌ కార్డును పాలసీలతో అనుసంధానం చేసుకున్నారని తెలిపారు. 
 
ఎల్‌ఐసి పాలసీదారులకు ఐపిఒలో రిజర్వేషన్‌ కల్పిస్తున్న నేపథ్యంలో అనేక మంది ఉత్సాహాంగా ఉన్నారని తెలుస్తోంది.
భవిష్యత్తులో మరిన్ని కొత్త పాలసీలు రానున్నాయని వెల్లడించారు. నాన్‌ పార్టిసిపేటింగ్‌ పాలసీల కోసం కసరత్తు జరుగుతుందని చెప్పారు. 
 
 ప్రస్తుతం రష్యాా ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న ఆందోళనల వల్ల విదేశీ సంస్థాగత మదుపర్లు ఈక్విటీ అమ్మకాలపై మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ఇది మార్కెట్లపై ఎలాంటి ఎలాంటి ప్రభావం చూపించొచ్చని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. తాము ఈ పరిస్థితులను చాలా దగ్గరగా పరిశీలిస్తున్నామని.. చాలా జాగ్రత్తగా ఉన్నామని పేర్కొన్నారు. 
 
ఎల్‌ఐసి ఐపిఒ కోసం సెబీకి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. వచ్చే నెల చివరి కల్లా ఇందులోని 5 శాతం వాటాలను విక్రయించాలని మోదీ ప్రభుత్వం నిర్దేశించుకుంది. కాగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా ప్రభుత్వం వాటాలను అమ్మకానికి పెట్టింది. 
 
ఇందులో మొత్తంగా 31.6 కోట్ల ఈక్వీటీ షేర్లను విక్రయించనుంది. ఐడిబిఐ బ్యాంక్‌లోనూ తమ కీలక వాటాలు ఉన్నాయని కుమార్‌ తెలిపారు. ఈ బ్యాంకింగ్‌ చానల్‌లో తాము మరింత పెరగడానికి వీలుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఐడిబిఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసి, ప్రభుత్వానికి కలిపి 90 శాతం వాటాలున్నాయి.