మరో కొత్త వ్యాక్సీన్‌కు డీసీజీఐ అనుమతి

కరోనా  మహమ్మారిపై సమర్థవంతంగా పోరాడేందుకు మరో వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కొత్త వ్యాక్సీన్‌కు సోమవారం అనుమతి ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ 12 నుంచి 18 ఏళ్ల వయసు మధ్య వారి కోసమని ఆ వ్యాక్సీన్ రూపకర్త తెలిపారు. ‘బయోలాజికల్ ఈ’ అనే సంస్థ రూపొందించిన ఈ వ్యాక్సీన్‌కు కార్బివ్యాక్స్ అని నామకరణం చేశారు.
 
ఈ విషయమై బయోలాజికల్ ఈ లిమిటెడ్ స్పందిస్తూ ‘‘బయోలాజికల్ ఈ లిమిటెడ్ రూపొందించిన కార్బివ్యాక్స్ వ్యాక్సిన్, దేశీయంగా రూపొందించిన మొట్టమొదటి రిసెప్టర్ బైండింగ్ డొమైన్ (ఆర్‌డీబీ) ప్రొటీన్ సబ్-యూనిట్ వ్యాక్సీన్. 12 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారికి అత్యవసర వినియోగానికి భారతదేశపు డ్రగ్ రెగ్యులేటర్ నుండి అనుమతి పొందిందని పేర్కొన్నారు.
ఇప్పటికే టీనేజర్లకు టీకాల విషయంలో భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ కు డీసీజీఐ అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కార్బెవ్యాక్స్ కూ అనుమతి దక్కడంతో.. దేశంలో పిల్లల కోసం రెండు టీకాలు అందుబాటులో ఉండనున్నాయి. కాగా, భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ 15 ఏళ్లు పైబడిన వారికే వ్యాక్సిన్లు అందిస్తోంది. 
కాగా, దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అతి తక్కువగా నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,405 కొవిడ్ కేసులు నమోదు అవగా… 235 మంది మృతి చెందారు. ప్రస్తుతం  1,81,075 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే రోజువారీ కొవిడ్ పాజిటివిటీ రేటు 1.24 శాతంగా నమోదు అయ్యింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య  5,12,344గా ఉంది. దేశవ్యాప్తంగా 1,75,83,27,441 మంది టీకా తీసుకున్నారు.