కాంగ్రెస్‌కు అవే చివరి ఎన్నికలు?

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో 2023 ఎన్నికలే కాంగ్రెస్‌ పార్టీకి చివరి అసెంబ్లీ ఎన్నికలు అవుతాయంటూ ఆయన చెప్పిన మాటల వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. 

దిగ్విజయ్‌ సింగ్‌ శనివారం రత్లాం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. అది జరగని పక్షంలో 2023 ఎన్నికలే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు చివరి ఎన్నికలు కావచ్చు అంటూ వారిని హెచ్చరించారు.

 ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ నేతలు నిజాయితీగా లేకపోతే ఎన్నికల్లో పోటీ చేయవద్దని సూచించారు. వారి వల్ల కాంగ్రెస్‌ అధికారంలోకి రాదు. అలాంటి వారికి కార్యకర్తలు మద్దతివ్వరూ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు ఎవరూ ముఖాముఖి మాట్లాడుకోవడం లేదని, ఒకరు ఇక్కడుంటే మరొకరు అక్కడ ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడో వ్యక్తి ఇంకెక్కడో ఉంటాడని, పనిచేసే విధానం ఇది కాదని స్పష్టం చేశారు.

‘‘మీరు కలిసికట్టుగా పనిచేయకుంటే ఇవే చివరి అసెంబ్లీ ఎన్నికలు అవుతాయి. నిజాయతీగా పోటీ చేయలేకపోతే ఇంట్లో కూర్చోండి. కాంగ్రెస్ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదు. అప్పుడు కార్యకర్తలు అనేవారు కనిపించరు’’ అని తెలిపారు. రాట్లాంలో కాంగ్రెస్ కార్యకర్తలు తనను కలిసేందుకు వేర్వేరుగా రావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

మధ్యప్రదేశ్‌లో వచ్చే ఏడాది చివరల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2018 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. అయితే, 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరడంతో 15 నెలల తర్వాత కమల్‌నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది.