టీమిండియా టెస్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ

టీమిండియా టెస్టు కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ‌ను  బీసీసీఐ సెల‌క్ట‌ర్ల బృందం ఎంపిక చేసింది. శ్రీలంకతో టెస్టు, టీ20 సిరీస్ లకు  టీమిండియాను కూడా ఎంపిక చేసింది. శ్రీలంకతో త్వరలో జరగనున్న టీ20, టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.  టీ20, టెస్టు జట్లకు రోహిత్ శర్మ సారథ్యం వహించనుండగా, జస్ప్రీత్ బుమ్రా‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.
గత కొంతకాలంగా దారుణంగా విఫలమవుతూ జట్టుకు భారంగా మారిన చతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలకు ఉద్వాసన పలికింది.  శ్రీలంకతో భారత్ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. తొలుత ఈ నెల 24 నుంచి టీ20 సిరీస్ జరగనుంది. అనంతరం, మార్చి 4 నుంచి టెస్టు సిరీస్ షురూ అవుతుంది.
శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ, పంత్‌కు విశ్రాంతి ఇవ్వగా, శార్దూల్ ఠాకూర్‌కు ఈ సిరీస్‌లో చోటు లభించలేదు. విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడిన కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్‌లు సిరీస్ మొత్తానికి దూరమయ్యారు.  దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన రవీంద్ర జడేజా తిరిగి రెండు జట్లలోనూ చోటు సంపాదించాడు.
రిషభ్ పంత్‌కు విశ్రాంతి ఇవ్వడంతో సంజు శాంసన్ టీ20ల్లో కీపింగ్ బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఉత్తరప్రదేశ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్‌కు సెలక్టర్ల నుంచి పిలుపు అందింది.  28 ఏళ్ల సౌరభ్ 2019/20 రంజీ ట్రోఫీ సీజన్‌లో 8 మ్యాచుల్లో 44 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికాలో ఇటీవల పర్యటించిన భారత-ఎ జట్టులోనూ సౌరభ్ ఆడాడు.
టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అవేశ్ ఖాన్
టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుభమన్ గిల్, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్ (ఫిట్‌నెస్‌ ఆధారంగా), రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, సౌరభ్ తివారీ.