సోనూసూద్‌ కదలికలను కట్టడి చేసిన ఎన్నికల సంఘం

పంజాబ్‌లో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోన్న క్రమంలో  ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే ఫిర్యాదుల మేరకు.. బాలివుడ్‌ నటుడు సోనూసూద్‌ కదలికలను ఎన్నికల సంఘం కట్టడి చేసింది. ఇక్కడి మోగాలోని పోలింగ్‌ కేంద్రాలను సందర్శించకుండా .. ఆయనపై నిషేదం విధించింది. 
 
ఆయన సోదరి మాళవిక సూద్‌ కాంగ్రెస్‌ తరుపున మోగా నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. పోలింగ్‌ కేంద్రాలను సందర్శిస్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని శిరోమణి అకాలీదళ్‌ నేతలు ఆరోపించారు. ఈమేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

మోగా జిల్లాలోని లంధేకే గ్రామంలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సోనూ సూద్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాన్ని (ఎస్‌యూవీ) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల పరిశీలకుల సూచన మేరకు వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఎస్‌డీఎం-కమ్-రిటర్నింగ్ అధికారి సత్వంత్ సింగ్ కూడా సోనూ సూద్ ఇంటిపై వీడియో నిఘాను ఆదేశించారు.
ఈ మేరకు సిటీ పోలీస​ స్టేషన్‌ ఆఫీసర్‌ దేవిందర్ సింగ్ మాట్లాడుతూ ..అనుమానాస్పద కార్యాచరణ ఆధారంగా ఎస్‌యూవీని స్వాధీనం చేసుకున్నాము. లంధేకే గ్రామంలోని పోలింగ్ బూత్ దగ్గర ఎస్‌యూవీ తిరుగుతున్నట్లు మాకు ఫిర్యాదు అందింది. మేము దానిని స్వాధీనం చేసుకున్నాము. అంతేకాదు అతను మోగాలో ప్రచారం చేస్తున్నప్పుడు ఆ వాహనాన్ని ఉపయోగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోనూ సూద్‌కు మోగా నియోజకవర్గంలో ఓటు లేనందున ఆ ప్రాంతంలోకి వెళ్లడానికి వీల్లేదని ఇంట్లోనే ఉండాలని ఎస్‌డీఎం-కమ్-రిటర్నింగ్ అధికారి సత్వంత్ సింగ్ కూడా ఆదేశించారు. అయితే అతను ఆ ఆదేశాలను ఉల్లంఘించాడు. తదుపరి విచారణలు జరుగుతున్నాయని అన్నారు.
అయితే.. సోనూసూద్‌ ఈ ఆరోపణలను ఖండించారు. ” నేను స్థానికుడిని. ఒక పార్టీ అభ్యర్థికి ఓటేయమని ఎవరినీ అడగలేదు. పోలింగ్‌ కేంద్రాల బయట ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ శిబిరాలను సందర్శిస్తున్నా’ అని తెలిపినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది. 
 
జిల్లా మేజిస్ట్రేట్‌ హరీష్‌ నయ్యర్‌ సైతం ఈ వ్యవహారంపై మోగా ఎస్‌ఎస్పీని నివేదిక కోరారు. సోనూసూద్‌ పోలింగ్‌ కేంద్రాలను సందర్శించడాన్ని కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరకరంగా భావించాయని చెప్పారు.  ఇదిలా ఉండగా ఎలక్షన్‌ ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఆయను పంజాబ్‌ రాష్ట్ర ఎన్నికల ఐకాన్‌గా నియమించిరన విషయం తెలిసిందే.