వెలుగులోకి మరో భారీ రుణాల ఎగవేత కుంభకోణం!

బ్యాంకులకు భారీగా రుణాలు తీసుకొని ఎగవేసిన మరో భారీ మోసం దేశంలో బయటపడింది. నౌకల తయారీ రంగానికి చెందిన ఎబిజి షిప్‌యార్డ్ దేశంలోని పలు బ్యాంకులను రూ. 22,842 కోట్ల మేర మోసగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన సిబిఐ కంపెనీ డైరెక్టర్లపై కేసు నమోదు చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 

మొత్తం 28 బ్యాంకులను ఎబిజి షిప్‌యార్డ్ మోసం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటుగా ఐసిఐసిఐ, ఐడిబిఐ వంటి బ్యాంక్‌లున్నాయి. 

ఎబిజి కంపెనీ ఎస్‌బిఐకి రూ.2,925 కోట్లు, ఐసిఐసిఐ బ్యాంక్‌కు రూ.7,089 కోట్లు, ఐడిబిఐ బ్యాంక్‌కు రూ. 3,634 కోట్లు, బ్యాంకు  ఆఫ్ బరోడాకు రూ. 1,614 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ. 1,244 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు రూ.1,288 కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉందని ఎస్‌బిఐ తన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ కేసులో సంస్థ డైరెక్టర్లు రిషి అగర్వాల్, సంతానం ముత్తుస్వామి, అశ్వినీ కుమార్‌లపై సిబిఐ కేసు నమో దు చేసింది. బ్యాంకులనుంచి కంపెనీ రుణాలు తీసుకుని నిధులను మళ్లించడం, నిధుల దుర్వినియోగం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని సిబిఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్లు ఆ మీడియా కథనాలు తెలిపాయి. 

ఎబిజి షిప్‌యార్డ్ లిమిటెడ్ సంస్థ నౌకల తయారీ, మరమ్మతు వంటి కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ సంస్థకు గుజరాత్‌లోని సూరత్, దహేజ్‌లలో యార్డ్‌లున్నారు. ఇప్పటివరకు ఈ కంపెనీ 165 నౌకలను నిర్మించింది. కాగా గతంలోనూ ఈ కంపెనీపై రుణాల ఎగవేత ఆరోపణలున్నాయి.