ఇస్లాం చరిత్రలో పరదా తిరస్కరించిన మహిళలూ ఉన్నారు 

ఓ ప్రక్క కర్నాటకలోని పాఠశాలలు, ఇతర విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై వివాదం కొనసాగుతుండగానే, కేరళ గవర్నర్ ఆరిఫ్ ముహమ్మద్ ఖాన్ శుక్రవారం ఇస్లాం చరిత్రలో పరదా పాటించడాన్ని(ముసుగు ధరించడం) తిరస్కరించిన మహిళలు కూడా ఉన్నారన్న ఉదంతాన్ని తెలిపారు. 

ఆయన పొరుగు రాష్ట్రంలో హిజాబ్ వివాదంపై తన వైఖరి ఏమిటని అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఈ విషయం చెప్పారు. అయితే ఆయన తన వైఖరి గురించి పూర్తిగా వివరించకుండానే, ముహమ్మద్ ప్రవక్త బంధువైన ఓ యువతి కథను ఈ సందర్భంగా ఉటంకించారు.

“నేను దాని గురించి చాలా క్లుప్తంగా చెబుతాను… ఓ యువతిని తన ఇంటికి ప్రవక్త ముహమ్మద్ స్వయంగా తీసుకొచ్చారు. ఆ యువతి ప్రవక్త సతీమణికి మేనకోడలు. ఆ యువతి చాలా అందగత్తె.. అని చరిత్ర చెబుతోంది” అని ఖాన్ విలేకరులకు వివరించారు.

ఇక ఆ యువతికి సంబంధించిన ఉదంతం కథను వివరించారు. ఆ యువతి భర్త మధ్య యుగం కాలంలో కుఫా గవర్నర్‌గా ఉండేవారు. హిజాబ్‌ను ధరించనందుకు ఆమెను ఆటపటిస్తుండేవారు. అప్పుడు ఆమె దేవుడు తనను అందంగా పుట్టించాడని, తన అందానికి ఆ సర్వేశ్వరుడే ఆమోద ముద్ర వేశారని వాదించినట్లు ఆ గవర్నర్ చెప్పారు.

ఇంకా ఆమె…ప్రజలు తన అందాన్ని చూడాలనుకుంటున్నారని, తనకు అందాన్ని ప్రసాదించిన దేవుని కృపను చూడాలనుకుంటున్నారని… తాను దేవుడికి కృతజ్ఞురాలినని… ఈ విధంగా ఇస్లాం తొలి తరం మహిళలు ప్రవర్తించేవారని, అంత వరకే తాను చెప్పదలచుకున్నానని కేరళ గవర్నర్ ఆరిఫ్ చెప్పారు.

ఉడుపిలోని ప్రభుత్వ ప్రీయూనివర్శిటీ కాలేజ్‌లోకి ప్రభుత్వం నిర్దేశించిన డ్రెస్‌కోడ్‌ను ఉల్లంఘించి ఆరుగురు విద్యార్థినులు జనవరిలో ప్రవేశించడంతో వివాదం రాజుకుంది. ఆ వివాదం తర్వాత కర్నాటక ఇతర ప్రాంతాలకి కూడా ప్రాకింది. 

హిందూ విద్యార్థులు దానికి ప్రతిగా కాషాయ కండువాలు ధరించి కాలేజ్‌లలోకి ప్రవేశించే ప్రయత్నాలు చేశారు. వారిని కూడా క్లాసులలోకి రానివ్వకుండా దూరంగా ఉంచడం జరిగింది. 

ఇదిలావుండగా వామపక్ష ప్రభుత్వం రాష్ట్ర లోకాయుక్త చట్టంను సవరించే ఆర్డినెన్స్‌పై తాను సంతకం చేయడాన్ని కూడా కేరళ గవర్నర్ ఆరిఫ్ ముహమ్మద్ ఖాన్ సమర్థించుకున్నారు. ఉత్తర్వు మంచిచెడులు నిర్ణయించడం తన విధి కాదని, ఆ ఆర్డినెన్స్ తన వద్ద మూడు వారాలపాటు ఆపి ఉంచాకే దానిపై సంతకం చేశానని చెప్పారు.