ఆస్తుల వివరాలు దాచిన మహారాష్ట్ర మంత్రికి జైలు శిక్ష 

ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలను దాచిన మహారాష్ట్ర మంత్రి బచ్చు కడూకి అమ్రావతి కోర్టు జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధించింది. 2014 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓం ప్రకాశ్ బాబూరావు కడూ అలియాస్ బచ్చు కడూ అచల్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
 
అయితే ఆ సమయంలో ఎన్నికల నామినేషన్ సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆయన ముంబైలో ఉన్న తన ఫ్లాట్ గురించి వెల్లడించలేదు.  దీంతో ఆయన ఆస్తులను దాచి ఎమ్మెల్యేగా గెలిచాడంటూ బీజేపీ కౌన్సిలర్ గోపాల్ తిరమరే కోర్టులో పిటిషన్ వేశారు. 
 
నాటి నుంచి నడుస్తున్న కోర్టు విచారణ ఇవాళ్టితో ముగిసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద బచ్చు కడూను దోషిగా తేల్చింది కోర్టు. ఆయనకు రెండు నెలల జైలు, రూ.25 వేల జరిమానా విధించింది. అయితే బచ్చు కడూ ఈ కేసులో పై కోర్టుకు వెళ్లేందుకు సమయం ఇవ్వాలని, బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు. 
 
దీనికి సానుకూలంగా స్పందించిన కోర్టు.. పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నెల రోజు సమయం ఇస్తూ బెయిల్ మంజూరు చేసింది.  కాగా, మహారాష్ట్రలోని అచల్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో వరుసగా 2004 నుంచి 2009, 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వచ్చారు. ఆయన ప్రస్తుతం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.