దేశ భద్రతకు భంగం కలిగిస్తే మీడియా అక్రెడిటేషన్ రద్దు

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సెంట్రల్ మీడియా అక్రెడిటేషన్ గైడ్‌లైన్స్-2022లో  ఓ కొత్త నిబంధనను చేర్చారు. భారత దేశ సార్వభౌమాధికారం, సమగ్రతలకు నష్టం కలిగించే విధంగా ప్రవర్తించినా; దేశ భద్రతకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే 
పాత్రికేయుల అక్రెడిటేషన్‌ను రద్దు చేయవచ్చునని నిబంధనలలో చేర్చారు. 
అదే విధంగా,  విదేశాలతో స్నేహ సంబంధాలు, ప్రజా భద్రత, నైతికత, డీసెన్సీలకు విరుద్ధంగా ప్రవర్తించినా, కోర్టు ధిక్కారం, పరువు నష్టం లేదా నేరాన్ని ప్రోత్సహించడం వంటివాటికి పాల్పడినా అక్రెడిటేషన్‌ను రద్దు చేయవచ్చునని పేర్కొన్నారు. ఈ మార్గదర్శకాలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసింది.
వెబ్ జర్నలిస్టులకు కూడా ప్రభుత్వ అక్రెడిటేషన్లు ఇవ్వాలని ఈ మార్గదర్శకాలు చెప్తున్నాయి. వీరికి ఈ సదుపాయం కల్పించాలని నిర్ణయించడం ఇదే మొట్టమొదటిసారి.  ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ, లోపాలను సరిదిద్ది  ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు తెలిపారు.
ఈ కొత్త నిబందనలు సంస్కరణలతో కూడుకున్నవని చెప్పారు. వృత్తిగత విధి నిర్వహణపై దృష్టిపెట్టి వీటిని రూపొందించినట్లు తెలిపారు. డిజిటల్ మీడియాకు పూర్తి స్థాయి గుర్తింపు ఇచ్చినట్లు తెలిపారు. చరిత్రలో తొలిసారి విదేశీ మీడియా కూడా అక్రెడిటేషన్ పొందుతుందన్నారు.
చైనా కోసం నిఘా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పాత్రికేయుడు గతంలో పట్టుబడ్డారని, అయితే ఆయన అక్రెడిటేషన్‌ను రద్దు చేయడం సాధ్యం కాలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనికి సంబంధించిన నిబంధన అప్పట్లో లేదని పేర్కొన్నారు.