300 మంది గిరిజనులు క్రైస్తవం నుంచి హిందూ మతంలోకి

మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలోని ఫుల్ గవాడి గ్రామంలో 212 గిరిజన కుటుంబాలకు చెందిన 300 మంది క్రైస్తవ మతం నుంచి హిందూ మతంలోకి తిరిగి వచ్చారని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కార్యకర్త ఆజాద్ ప్రేమ్ సింగ్ దామోర్  చెప్పారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్  మోహన్ భగవత్ హిందూ సంస్కృతిని ప్రచారం చేయడంతోపాటు మతం మారిన వారు తిరిగి వచ్చేలా ప్రతిజ్ఞ చేయాలని ప్రజలను కోరారు.

దీంతో వీహెచ్‌పీ ఘర్ వాపసీకి మూడు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆరు నెలలుగా క్రైస్తవ మిషనరీలకు వ్యతిరేకంగా దామోర్ ప్రచారం చేశారు.మెరుగైన విద్య, ఆరోగ్యసౌకర్యాలు కల్పిస్తామని చెప్పి 300 మందిని క్రైస్తవ మతంలోకి చట్టవిరుద్ధంగా మార్చారని దామోర్ ఆరోపించారు.

క్రైస్తవ మతాన్ని స్వీకరించడం ద్వారా తమ పూర్వీకులను అవమానిస్తున్నారని వారు సమావేశం నిర్వహించి 300 మంది గ్రహించారని స్థానిక నివాసి రాకేష్ భూరియా చెప్పారు. ‘‘మళ్లీ హిందూమతంలోకి మారడానికి అంగీకరించిన 212 కుటుంబాల జాబితా మా వద్ద ఉంది… మూడు రోజులుగా గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో హవనాలు, పూజలు నిర్వహిస్తున్నాం.’’ అని దామోర్ వివరించారు.