యుజిసి చైర్మన్‌గా జగదీశ్‌ కుమార్‌

యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) చైర్మన్‌గా తెలుగు వ్యక్తి మామిడాల జగదీశ్‌ కుమార్‌ నియమితులయ్యారు. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన జగదీశ్‌ ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) విసిగా ఉన్నారు. ఆయన్ను యుజిసి చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఎంపిక చేసింది. 
 
ఈ పదవిలో ఆయన ఐదేళ్ళ వరకు లేదా ఆయన వయసు 65 ఏళ్ళు నిండే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు, వీటిలో ఏది ముందైతే అంత వరకు కొనసాగవచ్చు. ఇటీవల యుజిసి చైర్మన్‌ పదవికి నోటిఫికేషన్‌ జారీ చేయగా.. మొత్తం 55 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. 
 
అందులో ఏడుగుర్ని కమిటీ ఎంపిక చేసింది. జగదీశ్‌తో పాటు ఇఫ్లూ ఉపకులపతి ఆచార్య. ఇ. సురేష్‌ కుమార్‌ కూడా ఉన్నారు. అయితే ఈ నెల 3న ఢిల్లీలో వీరంతా పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వగా.. చివరిగా ముగ్గురు సభ్యులను ఎంపిక చేసిన కమిటీ వారి పేర్లను కేంద్రానికి పంపింది. 
 
కేంద్రం జగదీశ్‌ కుమార్‌ను యుజిసి చైర్మన్‌గా ఎంపిక చేసింది. ఆయనతో పాటు  పుణే విశ్వవిద్యాలయం ఉప కులపతి నితిన్ ఆర్ కర్మల్కర్, యూజీసీకి చెందిన ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్ డైరెక్టర్ అవినాశ్ చంద్ర పాండేలను కూడా పరిశీలించారు.
 
ఐఐటి మద్రాస్‌లో చదువుకున్న జగదీశ్‌, ఐఐటి ఢిల్లీలో ప్రొఫెసర్‌గా చేశారు. 2016లో జెఎన్‌యు ఉప కులపతిగా నియమితులయ్యారు. ఐదేళ్ళ పదవీ కాలం పూర్తయిన తర్వాత 2021 జనవరిలో ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. 
 
ఈ నెల 26తో ఆయన పదవీ కాలం ముగియనుంది. యుజిసి చైర్మన్‌గా ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల్లో జగదీశ్‌ మూడో వ్యక్తి. జాతీయ విద్యా విధానం, 2020 అమలుతో ఉన్నత విద్యా రంగంలో మార్పులు జరుగుతున్న సమయంలో యూజీసీ చైర్మన్‌గా జగదీశ్ కుమార్ నియమితులయ్యారు.
 
జగదీశ్ కుమార్ తెలంగాణాలోని నల్గొండ జిల్లా మామిడాలలో జన్మించారు. ఐఐటీ-మద్రాస్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్, పీహెచ్‌డీ చేశారు. అనంతరం కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టొరల్ రీసెర్చ్ చేశారు. ఆయన నానోసైన్స్, నానో టెక్నాలజీలలో కృషి చేశారు.