పిఆర్‌సి విషయంలో మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ మధ్య మరోసారి సోమవారం జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. స్టీరింగ్ కమిటీ చర్చలకు రావాలని రాత పూర్వకంగా ప్రభుత్వం కోరడంతో మంగళవారం వారు చర్చలకు వెళ్లారు.
ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఉద్యోగ సంఘాల తరుపున 20 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులు వెళ్లి పిఆర్‌సి జిఓల అమలు నిలిపేయాలని, డిసెంబర్ నెల మాదిరిగా వేతనాలు ఇవ్వాలని, అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదికను బయటపెట్టాలనికోరారు. దీనిపై సిఎంతో చర్చించి అభిప్రాయం చెబుతామని అంటూ ఇదివరకటి వలే మంత్రులు వెళ్లిపోయారు.
మార్చి 22లోపు జీతాల ప్రక్రియ పూర్తి చేయాలని సర్క్యులర్ ఇచ్చి ఆ తరువాత రాత్రికి రాత్రే ప్రక్రియ పూర్తి చేయాలని, లేనిపక్షంలో అధికారులపై చర్యలు తీసుకుంటామని మరో సర్క్యులర్ ఇవ్వడం సర్వీసు నిబంధనలకు వ్యతిరేకమని తెలిపారు. తాము చర్చలకు రావడం లేదని మంత్రుల కమిటీ తప్పుడు ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు.
చర్చల సందర్భంగా ఉద్యోగ నాయకులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వలేక పోయారు. పైగా తప్పుడు లెక్కలు వేసి జీతాలు పెరిగాయని ఐఎఎస్ అధికారులే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పే స్లిప్పులను బుధవారం నాడు ఉదయం 11 గంటలకు దగ్ధం చేయాలని జెఎసి పిలుపునిచ్చింది.
ఇక తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసిన ఉద్యోగసంఘాల నాయకులు గురువారం జరుపతలపెట్టిన `చలో విజయవాడ’కు పెద్ద ఎత్తున ఉద్యోగులు తరలిరావాలని పిలుపిచ్చారు. ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని మంత్రులు కోరినా వారు తిరస్కరించారు.

More Stories
2027 పుష్కరాల లోపు పోలవరం పూర్తికి సహకరించండి
కడపలో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు పనులపై ఉద్రిక్తత
యూరియా, డిఎపి ఎరువుల వినియోగంపై నిఘా