317 జీవోను రద్దుకు ఎంప్లాయిస్ అసోసియేషన్ పోరాటం 

స్థానిక నిరుద్యోగ యువత ఉద్యోగాలను, తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయుల స్థానికతను కొల్లగొడుతున్న 317 జీవోను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగించాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. 

317 జీవోను రద్దు  చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్ కు తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులు సుమారు 3 లక్షల 7 వేల మంది యొక్క స్థానికత,  లక్షలాదిమంది నిరుద్యోగ యువత స్థానిక ఉద్యోగాలను కొల్లగొడుతున్న 317 జీవోను రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. 

ఈ పోరాటంలో భాగంగా ఫిబ్రవరి 7న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి 317 జీవో రద్దు కై వినతి పత్రం సమర్పిస్తారు. 8న నియోజకవర్గాల్లో  ఎంపీ లేదా ఎమ్మెల్యేలకు వినతి పత్రం సమర్పిస్తారు. 10న కలెక్టరేట్ ఆఫీసుల వద్ద ధర్నా జరుపుతారు.

13న సుప్రీం కోర్ట్ అడ్వకేట్ ను కలిసి చర్చిస్తారు. 15న రాష్ట్ర గవర్నర్ ని కలిసి వినతిపత్రం సమర్పిస్తారు. 22న 317 జిఓ బాధితులతో ఇందిరాపార్కు వద్ద ఒక రోజు దీక్ష జరుపుతారు. అదే రోజున కేంద్ర హోం శాఖ మంత్రికి  వినతి పత్రం సమర్పిస్తారు.

రెండు నెలల పీ.ఆర్.సీ. బకాయిలు ఇదే ఆర్ధిక సంవత్సరంలో విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని, ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, వి ఆర్ వో లకు డ్యూటీ చార్ట్ రూపొందించడంతో పాటు రెవెన్యూ శాఖలో కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.

అదే విధంగా, పంచాయతీ సెక్రెటరీలకు రోజువారీ హాజరు కొరకు ఉదయం ఏడు గంటలకి వాట్సాప్ ద్వారా ఫోటో పంపడం లాంటి అనాగరిక చర్యలని మానుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో పనిచేస్తున్న గ్రూప్ 1, గ్రూప్ 2 కు చెందిన తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి రప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.  కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం తదితర  సమస్యలపై వెంటనే దృష్టి సారించాలని కోరుతున్నారు.