కాంగ్రెస్ కన్నా 8 రేట్లు ఎక్కువగా బిజెపి ఆస్తులు 

కేవలం ఓట్లు, సీట్లలోనే కాకుండా ఆస్తులు, ఆదాయంలలో సహితం కాంగ్రెస్  బిజెపికి సమీపంలోకి రాలేక పోతున్నది. కాంగ్రెస్ కన్నా ఆరు రేట్లు ఎక్కువగా బిజెపి ఆస్తులున్నాయి. రెండో స్థాయిలో దాదాపు యుపికే పరిమితమైన బీఎస్పీ ఉండడం గమనార్హం. 
 
2019-20 ఆర్థిక సంవత్సరంలో బిజెపి అధికారికంగా ప్రకటించిన ఆస్తుల విలువే రూ.4,847.78 కోట్లుగా ఉంది. బిజెపి తర్వాతి స్థానంలో రూ.698.33 కోట్లతో బిఎస్‌పి నిలిచింది. మూడో స్థానంలో రూ.588.16 కోట్లతో కాంగ్రెస్‌ ఆస్తులున్నాయి. ఎన్నికల సంస్కరణల కోసం పోరాడే గ్రూపు, అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) ఈ వివరాలను శక్రువారం విడుదల చేసింది.
2019-20లో జాతీయ, ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పులను విశ్లేషిస్తూ ఎడిఆర్‌ ఒక నివేదికను రూపొందించింది. ఈ విశ్లేషణ ప్రకారం 7 జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆస్తులు వరుసగా రూ.6,988.57 కోట్లు, రూ.2,129.38 కోట్లుగా వున్నాయి.
 44 ప్రాంతీయ పార్టీల్లో మొదటి పది పార్టీల ఆస్తులే 95.27 శాతం ఉన్నాయి. వాటి విలువ రూ.2028.715 కోట్లు. వీటిల్లో సమాజ్‌వాదీ పార్టీ వాటా 26.46 శాతం (రూ.563.47కోట్లు)గా వుంది. తర్వాతి స్థానంలో టిఆర్‌ఎస్‌ రూ.301.47కోట్లుతో వుండగా, మూడో స్థానంలో అన్నాడిఎంకె రూ.2677.61 కోట్లుతో వుంది.
ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన ఆస్తుల్లో 76.99శాతం వాటాలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూపంలోనే వున్నాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కేటగిరీ కింద జాతీయ పార్టీల్లో బిజెపి, బిఎస్‌పి. కాంగ్రెస్ పార్టీలు  వరుసగా మొదటి మూడు  స్థానాలు ఆక్రమించాయి. రూ.3,253 కోట్లు, రూ.618.86 కోట్లు,  రూ. 240.90 కోట్లు మేరకు ఎఫ్‌డిలను కలిగివున్నాయి.
ప్రాంతీయ పార్టీల్లో టిఆర్‌ఎస్‌ రూ.256.01 కోట్ల ఎఫ్‌డిలతో రెండో స్థానంలో వుంది. జాతీయ పార్టీల అప్పులు రూ.74.27 కోట్లుగా వుండగా, ప్రాంతీయ పార్టీల రుణాలుల రూ.60.66 కోట్లుగా వున్నాయి.
 తృణమూల్ కాంగ్రెస్‌కు రూ. 11.32 కోట్లు, ఎఐటిసికి రూ.11.32 కోట్ల వరకు అప్పులు ఉన్నట్టు పేర్కొంది. ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే అత్యధికంగా తెలుగు దేశం పార్టీకి రూ. 30.34 కోట్లు, డిఎంకెకు రూ. 8.05 కోట్లు రుణాలు ఉన్నట్టు ఏడీఆర్ నివేదిక తెలియజేసింది.