జె ఎన్ యు విద్యార్థి షర్జీల్ ఇమామ్‌పై దేశద్రోహ కేసు

ప్రఖ్యాత జవహార్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి షర్జీల్ ఇమామ్‌పై ఢిల్లీ కోర్టు దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన నేపథ్యంలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో చేపట్టిన ఓ కార్యక్రమంలో ఇమామ్ అభ్యంతరకర, విధ్వేష ప్రసంగాలు చేశాడని రుజువైనట్లు కోర్టు పేర్కొంది. 
 
ఈ విషయమై వాదనలు విన్న అడిషనల్ సెషన్స్ జడ్జి అమితాబ్ రావత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఇమామ్‌పై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124ఏ (దేశద్రోహం), సెక్షన్ 153ఏ(భిన్న వర్గాలు, మతాల మధ్య శతృత్వాన్ని పెంచడం), సెక్షన్ 153బీ (జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించే వ్యాఖ్యలు చేయడం), సెక్షన్ 505 (ప్రజా దుష్ప్రచారానికి దారితీసే ప్రకటనలు).. వీటితో పాటు ఉపా చట్టంలోని సెక్షన్ 13 (చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం) ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.

డిసెంబర్ 13, 2019లో అలీగఢ్ యూనిర్సిటీలో ఇమామ్ చేసిన ఈ ప్రసంగంపై జనవరి 25, 2020లోనే క్రైం బ్రాంచ్ పోలీసులు సెక్షన్లు 124ఏ, 153ఏ, 505 ప్రకారం కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో షర్జీల్ చేసిన ప్రసంగాలను ఆధారంగా చేసుకుని ఈ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ కోర్టు సాక్ష్యాలను పరిశీలించి అతడిపై దేశద్రోహం కేసు నమోదుకు ఆదేశించింది.