భారత్ లో టీకాలు ప్రారంభించి ఏడాది!

భారత్ లో కరోనా విజృంభణ ఒక వంక కొనసాగుతుండగా,  రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే  ఉండగా,మరోవంక టీకాల కార్యక్రమం కూడా ముమ్మరంగా సాగుతున్నది. కరోనాను ఎదుర్కొనేందుకు టీకాలు మన దేశంలో అందుబాటులోకి వచ్చి నేటితో ఏడాది పూర్తవుతుంది. గత ఏడాది ఇదే రోజున, దేశ వ్యాప్తంగా ప్రజల కోసం ప్రభుత్వం టీకాల  ప్రక్రియ ప్రారంభించింది. 

 ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన కరోనా టీకాల  డ్రైవ్‌గా దీనిని  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ   అభివర్ణించారు. ఇందుకోసం కృషి చేసిన హెల్త్ వర్కర్లు, శాస్త్రవేత్తలు, ప్రజలందరికీ ఆయన ఓ ట్వీట్‌లో అభినందనలు తెలిపారు 
”ఈ రోజుతో ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏడాది పూర్తి చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో, ప్రతి ఒక్కరి కృషితో ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన వ్యాక్సినేషన్ డ్రైవ్‌గా ఇది నిలిచింది” అని మంత్రి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

నేడు ప్రతీ పల్లె, గ్రామంలో కూడా కరోనా టీకా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా కరోనాపై పోరులో భారత్ మరో కీలక మైలురాయిని చేరింది. పూర్తిగా ఉచితంగా ప్రారంభించిన కరోనా టీకాల  కార్యక్రమం ఇండియాలో అన్ని వర్గాల ప్రజలకు చేరువైంది. గతేడాది జనవరి 16న ఫ్రంట్ లైన్ వర్కర్లకు  క్సినేషన్ ఇవ్వడం మొదలైంది. మార్చి 1 నుంచి వ్యాధిగ్రస్తులు, వృద్దులకు టీకాలు ఇవ్వడం ప్రారంభించారు.

ఆ తర్వాత ఏప్రిల్ 1 నుంచి దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారందరికి టీకాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈనెల 3 నుంచి 15-18 ఏళ్ల టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. అయితే ప్రారంభంలో వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలామంది భయపడ్డారు. 

కొందరు భయంతో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారు కూడా ఉన్నారు. అనేక అనుమానాలు, అపోహల మధ్య దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అయినప్పటికీ… తక్కువ కాలంలోనే అనేక రికార్డులు సొంతం చేసుకుంది. దేశంలో ఇప్పటి వరకు 156 కోట్ల కరోనా డోసులను ఇచ్చారు. 

ఇందులో 90 కోట్లు మొదటి డోసులు కాగా…65 కోట్ల డోసులు రెండో డోసు. దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లు ఉచితంగా ప్రజలకు అందించారు. ఇక రెండు డోసులు పూర్తయిన వారికి… ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కొనేలా బూస్టర్ డోసు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. దీంతో పలువురు ప్రముఖులు.. ప్రజలు.. బూస్టర్ డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకున్నారు. 

కొత్తగా 2.7 లక్షల కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2 లక్షల 71వేల 202 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక 324 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. ఇప్పటివరకు 24 గంటల్లో దేశ వ్యాప్తంగా  కరోనా వైరస్ నుంచి లక్షా 38వేల 331 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఇండియాలో 15 లక్షల 50వేల 377 యాక్టివ్ కేసులు ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 16.28 శాతంగా ఉంది. ఇక ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7743కు చేరింది.
మరోవైపు కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ఇప్పటికే తమిళనాడు, జమ్ముకాశ్మీర్ లో వీకెండ్ లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రతీ ఆదివారం లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కేసుల సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రజలంతా తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.