రామజన్మభూమి ఆలయ పునాది పనులు పూర్తి

అయోధ్యలో రామ మందిర నిర్మాణపనులు మరింత వేగవంతం అయ్యాయి.అయోధ్యలో రామజన్మభూమి ఆలయ నిర్మాణం తొలి దశ పునాది నిర్మాణంతో పూర్తవుతోంది. మకర సంక్రాంతి రోజున ఆలయ పునాది పనులు పూర్తయ్యాయి.ఆదివారం పునాదుల వద్ద పూజలు జరిపి తదుపరి నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.

రామ మందిర నిర్మాణ పనులను వేగవంతం చేశామని శ్రీరామజన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రధానకార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. ‘‘భక్తుల ఆలయ దర్శనం డిసెంబర్ 2023లో ప్రారంభం కానుంది. డిసెంబర్ 2023కి మూడు నెలల ముందు గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి చేయాలన్నది ట్రస్ట్ లక్ష్యం. రాంలాలాను ఆలయంలో ప్రతిష్ఠించడం ద్వారా భక్తుల దర్శనాలు ప్రారంభమవుతాయి’’ అని చంపత్ రాయ్ తెలిపారు.

రామమందిర నిర్మాణం రాతి పని ప్రారంభం కానుంది. 20 అడుగుల ఆలయ నిర్మాణానికి 3 లక్షల క్యూబిక్ అడుగుల కంటే ఎక్కువ రాయి అవసరమవుతోందని, దీన్ని మీర్జాపూర్, బెంగళూరుల నుంచి సేకరించామని ఆలయ ప్రాజెక్టు మేనేజర్ వినోద్ మెహతా చెప్పారు. 50వేల అడుగులకు పైగా రాళ్లను అయోధ్యకు తరలించనున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నుంచి పోటీ చేయనున్నారు. రామాలయం నిర్మాణంపై రూపొందించిన చిత్రాన్ని ఎన్నికల సందర్భంగా ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రదర్శించాలని నిర్ణయించారు.